- 175 కేసులు నమోదు.
- వాణిజ్య సిలిండర్ల వేటలో 2,954 సీజ్.
- గృహ వినియోగదారులకు ఇబ్బంది లేదు.
- వేగంగా అందుతున్న సిలిండర్లు.
- వెయిటింగ్ లిస్ట్ 8.9 శాతానికి తగ్గింపు.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
హైదరాబాద్:మహా.
రాష్ట్రంలో గ్యాస్ అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్‌పై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు గ్యాస్ అక్రమ రవాణాకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 175 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 2,954 వాణిజ్య సిలిండర్లను అధికారులు సీజ్ చేశారని, అక్రమాలకు పాల్పడే ఏజెన్సీలు, వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే హోటళ్లు, క్యాంటీన్లపై నిఘా పెంచామని స్పష్టం చేశారు.
గృహ అవసరాల కోసం గ్యాస్ వాడే సామాన్య వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి భరోసా ఇచ్చారు. గతంలో ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ మరియు డెలివరీలో ఉన్న జాప్యాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ఆయన వివరించారు. గతంలో 15 శాతంగా ఉన్న గ్యాస్ బుకింగ్ పెండెన్సీ రేటును నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రస్తుతం 8.9 శాతానికి తగ్గించినట్లు గణాంకాలతో సహా వెల్లడించారు. దీనివల్ల వినియోగదారులు బుకింగ్ చేసుకున్న వెంటనే అతి తక్కువ సమయంలోనే సిలిండర్లు వారి ఇంటికి చేరుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం ద్వారా అర్హులైన సామాన్యులకు సకాలంలో గ్యాస్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్యపరంగా మళ్లించే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేయడానికి వెనుకాడబోమని చెప్పారు. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గ్యాస్ డెలివరీలో ఏవైనా జాప్యం జరిగినా లేదా అధిక ధరలు వసూలు చేసినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణ కారణంగా గ్యాస్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని, భవిష్యత్తులో ఈ వెయిటింగ్ పీరియడ్‌ను మరింత తగ్గించి త్వరితగతిన సేవలు అందిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.







