- భద్రాద్రిలో కమనీయం.. సీతారాముల కల్యాణ వైభోగం.
- పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అభివృద్ధి పనులకు అంకురార్పణ.
భద్రాచలం, మార్చి 27: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమై పులకించింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి క్షేత్రంలో జగదభిరాముడైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా సాగింది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన సుందరమైన కల్యాణ మండపంలో లోక కల్యాణార్థం జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్త భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవాయిద్యాల మోత, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతమ్మవారికి రామయ్య పెళ్లి కుమారుడిగా ముస్తాబై కల్యాణ వేదికపైకి రాగా, భక్తుల జయజయధ్వానాలతో భద్రాద్రి పరిసరాలు మారుమోగాయి.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన ధర్మపత్నితో కలిసి ఈ మహా వేడుకలో పాల్గొన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ముఖ్యమంత్రి దంపతులు తలపైన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఉంచుకుని ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు మూలవిరాట్టును దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), వాకిటి శ్రీహరి వంటి ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు అనేకమంది ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాలుపంచుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి వసతి కల్పించడంలో అధికారులు సఫలమయ్యారు.
కేవలం ఆధ్యాత్మిక వేడుకలతోనే కాకుండా, భద్రాద్రి క్షేత్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కీలక నిర్ణయాలు ప్రకటించారు. భద్రాచలం ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తొలిదశలో 351 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నిధులతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం 180 కోట్లు వెచ్చించనుండగా, ఆలయ పరిసరాల సుందరీకరణకు 96 కోట్లు, గోదావరి నది తీరంలోని ఘాట్‌ల ఆధునీకరణకు 75 కోట్లు కేటాయించారు.
భవిష్యత్తులో భద్రాచలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి గృహాలు, క్యూ లైన్లు, అన్నదాన సత్రాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా గోదావరి ఘాట్‌ల అభివృద్ధి పనుల ద్వారా పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు భద్రతతో కూడిన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఈ నిధుల వినియోగం పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రామచంద్రుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వైభవ వేడుక ముగిసింది.







