ఢిల్లీ, మహా.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాల నేపథ్యంలో, ఆ దేశం అత్యంత భారీ స్థాయిలో ఎదురుదాడికి రంగం సిద్ధం చేసుకుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 10 లక్షల మందితో కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేస్తూ ఇరాన్ ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. బసిజ్ ఫోర్స్, ఐఆర్‌జీసీ వంటి సైనిక దళాలను యుద్ధ ప్రాతిపదికన బలోపేతం చేస్తూ, తమ దేశ గడ్డపై అమెరికా సేనలు అడుగుపెడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఘాటుగా హెచ్చరిస్తోంది. యుద్ధానికి సిద్ధమవ్వాలన్న పిలుపుతో ఇరాన్ యువత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వస్తుండగా, ప్రభుత్వం సైతం యుద్ధంలో పాల్గొనే అర్హత వయసును తగ్గించినట్లు తెలుస్తోంది.
**చిన్నారుల సేవలు.. ‘ఫర్ ఇరాన్’ ప్రణాళిక**
సమరానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న ఇరాన్, ‘ఫర్ ఇరాన్’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా దేశ రక్షణలో చిన్నారులనూ భాగస్వాములను చేస్తోంది. సుమారు 12 ఏళ్ల వయసున్న పిల్లలను సైతం పెట్రోలింగ్, చెక్‌పోస్టుల వద్ద భద్రతా విధుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు పశ్చిమాసియా వైపు అమెరికా అదనపు సైనిక బలగాలను తరలిస్తుండటంతో ఈ ప్రాంతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో చిక్కుకుంది.
**బలగాల కొరతతో ఇజ్రాయెల్ సతమతం**
ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అసాధారణ రీతిలో పెంచుకుంటుంటే, మరోవైపు శత్రు దేశమైన ఇజ్రాయెల్‌లో సైనికుల కొరత కలవరపెడుతోంది. అవసరమైన దానికంటే సుమారు 12 వేల మంది సైనికులు తక్కువగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలహీనపడే ప్రమాదం ఉందని ఆ దేశ సైనికాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ప్రధాని నెతన్యాహుకు సైన్యం నుంచి అత్యవసర లేఖలు వెళ్లినట్లు సమాచారం. ఒకవైపు ఇరాన్ లక్షలాది మందితో కదనరంగానికి కదులుతుండటం, మరోవైపు ఇజ్రాయెల్ సైనిక కొరత ఎదుర్కోవడం ఈ యుద్ధ ముప్పులో అత్యంత కీలకమైన అంశాలుగా మారాయి.







