- రాష్ట్రంలో పుష్కలంగా ఇంధన నిల్వలు.
- సాధారణ వినియోగం కంటే రెండింతలు సరఫరా.
- గందరగోళానికి తావులేదన్న ప్రభుత్వం
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా నివేదికను విడుదల చేసింది. ఇంధన సరఫరా వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, వినియోగదారుల అవసరాలకు మించి నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం అధికారిక గణాంకాలతో స్పష్టం చేసింది. మార్చి 27వ తేదీ నాటి లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో డిమాండ్ కంటే సరఫరానే అత్యధికంగా ఉంది. సాధారణంగా ప్రతిరోజూ అవసరమయ్యే ఇంధన పరిమాణంతో పోలిస్తే, మార్చి 26వ తేదీన జరిగిన సరఫరా దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది అటు రవాణా రంగానికి, ఇటు సామాన్య వినియోగదారులకు పెను ఊరటనిచ్చే అంశం.
పెట్రోల్ (ఎంఎస్) వినియోగ గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రంలో సగటున రోజువారీ సరఫరా 5,883 కిలో లీటర్లుగా ఉంటుంది. అయితే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్చి 26 నాటికి ఏకంగా 16,609 కిలో లీటర్ల పెట్రోల్‌ను ప్రభుత్వం సరఫరా చేసింది. అంటే సాధారణ డిమాండ్ కంటే ఇది సుమారు 182 శాతం అదనం. ఇదే తీరులో రవాణా, వ్యవసాయ రంగాలకు వెన్నెముకగా నిలిచే డీజిల్ (హెచ్‌ఎస్‌డీ) సరఫరా కూడా ఆశాజనకంగా సాగుతోంది. రాష్ట్రంలో రోజువారీ సగటు డీజిల్ అవసరం 7,348 కిలో లీటర్లు కాగా, ప్రభుత్వం రికార్డు స్థాయిలో 19,580 కిలో లీటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇది సాధారణ డిమాండ్‌తో పోలిస్తే 167 శాతం అధికం.
మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్త ఇంధన అవసరాలను తీర్చడానికి రోజుకు సగటున 13,231 కిలో లీటర్లు సరిపోతుండగా, ప్రస్తుతం 36,189 కిలో లీటర్ల మేర నిరంతర సరఫరా జరుగుతోంది. ఈ గణాంకాలను బట్టి రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం మరోసారి భరోసా ఇచ్చింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని, ఇంధనం కోసం కంగారుపడి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. “తెలంగాణ రైజింగ్” లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రగతి రథం ఎక్కడా ఆగకుండా, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఈ నివేదిక ద్వారా స్పష్టం చేసింది.







