Mahaa Daily Exclusive

  ఖిల్లా సాక్షిగా ‘రాజకీయ’ వింత వియ్యం..! సీతమ్మ తరపున కవిత.. రామయ్య తరపున మహేష్ గౌడ్..

Share

  • ఖిల్లా సాక్షిగా ‘రాజకీయ’ వింత వియ్యం!
  • సీతమ్మ తరపున కవిత.. రామయ్య తరపున మహేష్ గౌడ్.
  •  రాజకీయ ప్రత్యర్థులు కాదు.. ఇప్పుడు ‘వియ్యంకులు’!
  •  రామయ్య పెళ్లిలో కలిసిన ‘రాజకీయ’ హస్తాలు.
  •  తలంబ్రాల సాక్షిగా తలవంచిన వైరం!.
  •  ఖిల్లా రామాలయంలో కళ్లు చెదిరే రాజకీయ దృశ్యం!

నిజామాబాద్‌,మహా.

 

రాజకీయాల్లో బద్ధశత్రువుల్లా తలపడే నేతలు, ఆ కోటలో మాత్రం ‘వియ్యంకులు’గా మారి లోకాన్ని విస్మయపరిచారు! నిత్యం విమర్శల బాణాలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడే కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు.. శ్రీరామనవమి సాక్షిగా ఒకే పీటపై కూర్చుని వినూత్న రాజకీయ ఒరవడికి తెరలేపారు. నిజామాబాద్‌లోని చారిత్రాత్మక శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రామాలయం)లో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవం కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, రాష్ట్రవ్యాప్త రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. దీనికి ప్రధాన కారణం.. పెళ్లికొడుకు రామయ్య తండ్రి తరపున టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు నిలవగా, పెళ్లికూతురు సీతమ్మ తల్లి తరపున మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త దేవనపల్లి అనిల్ నిలిచి కన్యాదాన క్రతువును జరిపించడం!

రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న తరుణంలో, నిజామాబాద్ ఖిల్లా రామాలయం వద్ద బుధవారం ఉదయం నుంచే భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. అయితే, అక్కడ ఒక్కసారిగా రాజకీయ సెన్సేషన్ మొదలైంది. టీపీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ‘పెళ్లికొడుకు’ పక్షాన నిలబడగా, అదే సమయంలో కల్వకుంట్ల కవిత తన భర్త అనిల్‌తో కలిసి సీతమ్మ తల్లికి ‘సారె’ సమర్పించి ‘పెళ్లికూతురు’ తరపున బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు అగ్రనేతలు ముత్యాల తలంబ్రాలను కలిపి స్వామివారి శిరస్సుపై పోయడం చూసిన భక్తులు ఆశ్చర్యంతో పాటు ‘జై శ్రీరామ్’ నినాదాలతో ఆలయాన్ని మారుమోగించారు.

ఈ అరుదైన దృశ్యం వెనుక ఉన్న రాజకీయ విశ్లేషణ ఇప్పుడు ఇందూరు గడ్డపై హాట్ టాపిక్‌గా మారింది. నిన్నమొన్నటి వరకు రాజకీయ క్షేత్రంలో కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు నేతలు, రామయ్య సన్నిధిలో వియ్యంకులుగా వ్యవహరించడం వెనుక ఏదైనా ‘రాజకీయ వ్యూహం’ ఉందా? లేక భక్తి ముందు రాజకీయాలు బలాదూర్ అని నిరూపించారా? అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ వంటి కీలక నేతల సమక్షంలో, అధికార-ప్రతిపక్ష నేతలు ఒకే వేదికపై ‘బంధువుల’ తరహాలో కలిసి ఈ పవిత్ర కార్యం నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లోనే ఒక సంచలనం.

వేద పండితుల మంత్రోచ్ఛారణలు, నూతన వస్త్రాల కాంతులు, మెరిసిపోయే ముత్యాల తలంబ్రాల మధ్య జరిగిన ఈ వేడుకను తిలకించిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు, వడపప్పు, బెల్లం పానకాన్ని పంపిణీ చేశారు. రాజకీయం ఏదైనా.. రామయ్య పెళ్లిలో మాత్రం పీసీసీ చీఫ్, కవిత దంపతులు ఒక్కటవ్వడం ఖిల్లా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇందూరు కోట సాక్షిగా జరిగిన ఈ ‘రాజకీయ కళ్యాణం’ మున్ముందు ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Latest