Mahaa Daily Exclusive

  మొక్కజొన్న రైతులకు కొండంత అండ…

Share

* కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ.
* ధరల పతనంతో అన్నదాత విలవిల.
* ఆదుకోవాలని శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి.
అమరావతి, మహా.
రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చలించిపోయారు. ఆశించిన స్థాయిలో ధరలు లభించక, పెట్టుబడి కూడా రాక దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయన అత్యవసర లేఖ రాశారు. మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్ర రైతులకు భరోసా కల్పించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు అనుభవిస్తున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో సుమారు 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైందని, దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా రావడంతో ఒక్కసారిగా మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయని వివరించారు. క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ. 2,400 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు కేవలం రూ. 1,500 నుంచి రూ. 1,700 మాత్రమే చెల్లిస్తున్నారని, దీనివల్ల రైతులు క్వింటాల్‌కు రూ. 700 నుంచి రూ. 900 వరకు నష్టపోతున్నారని మంత్రి నివేదించారు. పండించిన పంటను అమ్ముకోలేక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతుల దీనస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు.
మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన నివేదికపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ‘ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్’ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ పథకం అమలులో భాగంగా రైతులకు కలిగే నష్టాన్ని పూర్తిగా, అంటే వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరించాలని, మొత్తం ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుని రైతులకు చెల్లింపులు జరిపేలా చూడాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది రైతు కుటుంబాలకు గొప్ప ఆర్థిక ఊరట లభిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest