- తెలంగాణలో ఇంధన నిల్వలు పుష్కలం.
- ప్రధాని మోదీకి వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- పెట్రోల్, గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ..
- అపోహలు నమ్మవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- ఇంధన భద్రతతో పాటు ఈవీల ప్రోత్సాహమే లక్ష్యం.. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు అత్యంత సమృద్ధిగా ఉన్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంధన లభ్యత, సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలను ఆయన ప్రధానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కమిటీ నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తోందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోనూ ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడటంతో పాటు, కృత్రిమ కొరత సృష్టించే బ్లాక్ మార్కెట్ ముఠాలపై కఠినంగా వ్యవహరించేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు మరియు వృద్ధాశ్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రాధాన్యత క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పెట్రోల్ బంకులో ఉన్న నిల్వలు మరియు రోజువారీ అమ్మకాలను అధికారులు నిశితంగా గమనిస్తున్నారని, ప్రస్తుతం తెలంగాణలో సాధారణ రోజుల్లో 36,189 కిలో లీటర్ల ఇంధన వినియోగం జరుగుతుండగా, దానికి ఐదు రెట్లు అధికంగా అంటే 1,88,210 కిలో లీటర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని గణాంకాలతో సహా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇంధన కొరతపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేవలం తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఒక ఉద్యమంలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఈవీ వాహనాలపై వంద శాతం రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో బ్యాటరీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఈవీ తయారీ రంగానికి అండగా నిలుస్తున్నామని వివరించారు.
హైదరాబాద్ మహానగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సుమారు 1.20 లక్షల పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రోఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే వినూత్న కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో ఆర్టీసీలో కూడా కేవలం ఈవీ బస్సులనే వినియోగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలు ఇంధన భద్రతను కల్పించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో తెలంగాణను ఆదర్శంగా నిలుపుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







