- లోక్ భవన్‌లో ఆధ్యాత్మిక వైభవం.
- శ్రీరామనవమి వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్న గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా.
- ధర్మరక్షణకు శ్రీరాముడే ఆదర్శం.
- శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో లోక్ భవన్‌లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. శుక్రవారం నిర్వహించిన ఈ వేడుకల్లో గవర్నర్ తన సతీమణి జానకి శుక్లాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్ భవన్ ఆవరణలోని ‘సంస్కృతి’ కమ్యూనిటీ హాల్‌లో ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య కనులపండువగా సాగింది. గవర్నర్ దంపతులు స్వయంగా పీఠంపై కూర్చుని శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కల్యాణ క్రతువులో పాల్గొని లోక కల్యాణం కోసం ప్రార్థించారు. తెలంగాణ రాజ్‌భవన్ (లోక్ భవన్) చరిత్రలో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం ఇదే ప్రథమమని చెప్పవచ్చు. అంతకుముందు రోజు జరిగిన మహా అష్టమి వేడుకల కొనసాగింపుగా ఈ నవమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు ధర్మానికి మరియు నైతిక విలువలకు ప్రతిరూపమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. సమాజంలో శాంతి, సౌభాగ్యం వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాల అనంతరం లోక్ భవన్ సిబ్బందికి, ఉన్నతాధికారులకు ఆయన స్వయంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్ భవన్‌లో పూజా కార్యక్రమాలు ముగిసిన వెంటనే గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మంగళ్‌హాట్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్, రథంపై ఉన్న సీతారాముల విగ్రహాలకు హారతి ఇచ్చి నమస్కరించారు. ఈ సందర్భంగా భక్తుల జయజయధ్వానాల మధ్య శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. కేవలం ఒక వేడుకగా మాత్రమే కాకుండా, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా గవర్నర్ ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.







