- శాసనసభలో సరికొత్త సందడి..
- ఆటల బరిలోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు!
- 28 నుంచి ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’.
- ఎల్బీ స్టేడియంలో క్రీడా పోరుకు సర్వం సిద్ధం!
- తెలంగాణ చరిత్రలో తొలిసారి.. ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక క్రీడా సమరం!
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిరంతరం రాజకీయాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమలోని క్రీడా నైపుణ్యాన్ని చాటుకునేందుకు ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ వేదిక కానుంది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఎల్బీ స్టేడియం వేదికగా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధుల కోసం ఇలాంటి భారీ స్థాయి క్రీడా ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఛైర్మన్‌గా, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేవలం పోటీలకే పరిమితం కాకుండా, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, తద్వారా రాష్ట్ర ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తిని, స్ఫూర్తిని నింపడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని మంత్రులు వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో క్రీడా పోటీలు జరుగుతుండగానే, అటు రవీంద్ర భారతిలో మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్లాన్ చేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక పోటీల నిర్వహణ కోసం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని కన్వీనర్‌గా నియమిస్తూ మరో 13 మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు, క్రీడల నిర్వహణకు సంబంధించిన రూట్ మ్యాప్ మరియు వసతులపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28న మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో క్రీడలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి మరియు మంత్రుల బృందం స్పీకర్‌ను కలిసి స్పోర్ట్స్ కిట్‌ను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ పోటీల్లో పాల్గొనబోతుండటంతో అసెంబ్లీ ప్రాంగణంలో క్రీడా వాతావరణం నెలకొంది.







