మహిళా రిజర్వేషన్లు, పునర్విభజనతో రేవంత్‌లో ‘డిప్రెషన్’.
* కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజం.
* ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రాంతీయ విద్వేషాలు రగిలించేలా ముఖ్యమంత్రి తీరు.
* కేసీఆర్‌తో రేవంత్ కుమ్మక్కు.. అందుకే కాళేశ్వరం అవినీతిపరులపై చర్యలు లేవు.
కరీంనగర్ ,మహా:
“కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు ప్రక్రియతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వణుకు మొదలైందని, ఆ డిప్రెషన్ లోనే ఆయన ప్రధానమంత్రిపై దిగజారి మాట్లాడుతున్నారని” కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లోని తన నివాసంలో సోలార్ ప్యానెళ్ల పనితీరును అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు చేతగాక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే దక్షిణాది-ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రగిలిస్తూ ముఖ్యమంత్రి సరికొత్త డ్రామాలకు తెరలేపారని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుతున్న భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ‘గాడిద గుడ్డు’ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. “లాగుల్లో తొండలు విడుస్తా” వంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి పదవికే కళంకం తెస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వకుండా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం బాధ్యతారాహిత్యమని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై స్పందిస్తూ, ఆ ప్రాజెక్టు డిజైన్ లోపానికి ప్రధాన కారకుడు కేసీఆరేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ స్వయంగా ఇంజనీర్ అవతారమెత్తి ఇష్టానుసారంగా డిజైన్లు మార్చడం వల్లే నేడు ప్రాజెక్టు ఈ స్థితికి చేరుకుందని విమర్శించారు. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేసీఆర్ కుటుంబంపై గానీ, కాళేశ్వరం అవినీతిపరులపై గానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు. సీబీఐకి పంపిన లేఖలోనూ పూర్తిస్థాయి వాస్తవాలను పొందుపరచకుండా రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తోందని, ఇదంతా ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారాన్ని బండి సంజయ్ కొట్టిపారేశారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం ఏమిటో రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లను 50 శాతం పెంచుతున్నప్పుడు దక్షిణాదికి అన్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కేవలం మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, తులం బంగారం వంటి హామీలను అమలు చేయలేకనే ఇలాంటి సరికొత్త వివాదాలను సీఎం తెరపైకి తెస్తున్నారని విశ్లేషించారు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, దానిని తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే, ప్రజల కోసం, పేదల కోసం పనిచేసే పార్టీలకే మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని, రాజకీయాలను పక్కనపెట్టి ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని బండి సంజయ్ హితవు పలికారు.







