Mahaa Daily Exclusive

  ప్రజాప్రతినిధులు సోలార్ శక్తితో ఆదర్శంగా నిలవాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు

Share

ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలి.
*ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోండి.
* కోటి ఇళ్లకు సౌర వెలుగులే లక్ష్యం.
* రూ.75వేల కోట్ల బడ్జెట్.. భారీ సబ్సిడీ, తక్కువ వడ్డీతో రుణాలు.. వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి పిలుపు.
కరీంనగర్,మహా.
“ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ముందుగా తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని, సామాన్య మానవుడు విద్యుత్తును కొనుగోలు చేసే స్థాయి నుంచి విక్రయించే స్థాయికి ఎదగాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.” శనివారం కరీంనగర్‌లోని తన నివాసంపై నూతనంగా ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ అధికారులు, డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కరపత్రాలను విడుదల చేసిన మంత్రి, సౌర శక్తి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు అందరిపై ఉందని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు తాను స్వయంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించిన బండి సంజయ్, దీనివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. తన నివాసానికి ప్రస్తుతం నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు విద్యుత్ బిల్లు వస్తోందని, సోలార్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఇకపై ఆ బిల్లు కేవలం రూ.5 వేల లోపే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దేశంలోని కోటి ఇళ్లకు ఉచితంగా విద్యుత్ అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా, అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ప్రజలు ఆదాయం కూడా పొందవచ్చని సూచించారు.
ఈ పథకం కింద లభించే రాయితీల గురించి వివరిస్తూ, ఒక్కో ఇంటిపై సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు కేంద్రం సబ్సిడీ అందిస్తోందని మంత్రి తెలిపారు. పేద ప్రజలకు సైతం ఇది భారం కాకుండా ఉండేందుకు 80 శాతం వరకు బ్యాంకు రుణ సౌకర్యం కల్పించామని, ఆ రుణాన్ని కూడా సులభ వాయిదాలలో చెల్లించే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. అయితే, ఇంతటి అద్భుతమైన పథకంపై తెలంగాణ ప్రభుత్వం సరైన రీతిలో అవగాహన కల్పించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 5 నుంచి 7 వేల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకునేలా కేంద్రం నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగంలో కూడా సౌర శక్తి విప్లవం రావాలన్నదే కేంద్రం లక్ష్యమని, అందుకే ‘పీఎం-కుసుమ్’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 1800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని టీజీ-రెడ్కో లక్ష్యంగా పెట్టుకుందని, రైతులు, సహకార సంఘాలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదని, రైతులు తమ పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, విద్యుత్ విక్రయదారుగా మారి అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. అంత్యోదయ సిద్ధాంతంతో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందించడమే మోదీ ప్రభుత్వ ధ్యేయమని, ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Latest