Mahaa Daily Exclusive

  దీదీది ‘విక్టిమ్ కార్డ్’ రాజకీయం. .

Share

 

*బంగాల్ నుంచి టీఎంసీని సాగనంపండి.

* మమత సర్కార్‌పై బీజేపీ ‘ఛార్జ్ షీట్’.

* చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతాం.

* మే 6న రాష్ట్రంలో మా ప్రభుత్వమే.. నిరుద్యోగులకు వయోపరిమితి సడలింపు హామీ.

* కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్వజం.

 

కోల్‌కతా, మహా:

“పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ బాధితురాలిగా నటిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఆమె ఆడుతున్న ‘విక్టిమ్ కార్డ్’ నాటకాలను ప్రజలు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు.” శనివారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వ వైఫల్యాలపై ‘ఛార్జ్ షీట్’ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భయం, అవినీతి, చొరబాట్లతో నిండిన పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, మే 6వ తేదీన బంగాల్‌ గడ్డపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మమతా బెనర్జీ రాజకీయ శైలిని ఎండగడుతూ అమిత్ షా ఘాటైన విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దీదీ ఏదో ఒక కారణంతో బాధితురాలిగా నిలబడతారని, కొన్నిసార్లు కాలు విరిగిందని, మరికొన్నిసార్లు తలకు కట్టుతో కనిపిస్తారని ఎద్దేవా చేశారు. అనారోగ్యం నెపంతోనో లేదా ఎన్నికల సంఘాన్ని దూషించడం ద్వారానో ప్రజల్లో నిస్సహాయతను ప్రదర్శించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, కానీ ఈ ఎత్తుగడలు ఇకపై సాగవని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం టీఎంసీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని, కేవలం బంగాల్‌లోనే ప్రత్యేక న్యాయాధికారులను నియమించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో మమత సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశ భద్రతకు ముప్పుగా మారిన అక్రమ చొరబాటుదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా, దేశం నుంచే వెళ్లగొట్టడమే బీజేపీ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర సరిహద్దుల రక్షణ విషయంలో మమత సర్కార్ అనుసరిస్తున్న ఉదాసీనతను అమిత్ షా తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే సరిహద్దు వెంబడి కంచె వేయడానికి అవసరమైన భూమిని సేకరిస్తామని, చొరబాట్లను పూర్తిస్థాయిలో అరికడతామని హామీ ఇచ్చారు. అలాగే ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో మమత మతపరమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓబీసీ కేటగిరీలో చేర్చిన 77 వర్గాలలో 75 ముస్లిం వర్గాలే ఉండటంపై ఆయన మండిపడ్డారు. ఓబీసీ హోదాను మతం ఆధారంగా నిర్ణయించడం అన్యాయమని, అర్హులైన ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివక్షకు త్వరలోనే ముగింపు పలుకుతామని చెప్పారు.

నిరుద్యోగ యువతకు అమిత్ షా కీలక హామీని ప్రకటించారు. టీఎంసీ హయాంలో జరిగిన రిక్రూట్మెంట్ కుంభకోణాల వల్ల వేలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని, వయోపరిమితి దాటిపోయి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అటువంటి బాధితులకు ఐదేళ్ల పాటు వయోపరిమితి సడలింపు ఇస్తామని, ఎస్ఎస్సీ నియామకాల్లో పారదర్శకత పాటిస్తూ అర్హులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్యతో కలిసి విడుదల చేసిన ఈ ఛార్జ్ షీట్ టీఎంసీ పతనానికి ఆరంభమని ఆయన అభివర్ణించారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు అబద్ధాలకు, హింసకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, మే 4న వెలువడే ఫలితాలతో బంగాల్‌లో నూతన శకం మొదలవుతుందని అమిత్ షా ఆకాంక్షించారు.

Latest