- అసెంబ్లీలో ‘పేరెంటల్ సపోర్ట్ బిల్లు’ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.
- భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టం.
- కన్నవారిని రోడ్డున పడేస్తే ఊరుకోం: సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న పవిత్ర సంకల్పంతోనే తమ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు – 2026”పై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ఒక సామాజిక అవసరమని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టాన్ని రూపొందించామని, ఇది వృద్ధుల రక్షణ దిశగా ఒక చారిత్రక ముందడుగు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు.
నేటి ఆధునిక సమాజంలో మనిషి బంధాలు, అనుబంధాలను విస్మరించి కేవలం భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్నవారిని రోడ్డున పడేసి ఆస్తుల కోసం కొట్లాడుకునే పరిస్థితులు రావడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. రాజ్యాంగంలో పిల్లల కోసం ఆర్టికల్ 21(ఏ), ఆర్టికల్ 24 వంటి అనేక రక్షణలు ఉన్నాయని, అలాగే మహిళల కోసం నిర్భయ, పోక్సో, గృహ హింస నిరోధక చట్టాలు వంటి అనేక పటిష్టమైన చట్టాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. దేశంలో 2007 నుంచే వృద్ధుల సంరక్షణ చట్టం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులపై జరుగుతున్న వివక్ష, నిర్లక్ష్యం తగ్గడం లేదని, అందుకే మరింత జవాబుదారీతనంతో కూడిన ఈ నూతన బిల్లును ప్రవేశపెట్టామని వివరించారు.
సభలో మాతృ పితృ భక్తి ప్రాముఖ్యతను వివరిస్తూ ముఖ్యమంత్రి శ్రవణ కుమారుడి పురాణ గాథను ప్రస్తావించారు. ప్రతి బిడ్డ శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే అసలు ఇటువంటి చట్టాల అవసరమే ఉండదని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, రేమండ్స్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా జీవితంలో ఎదురైన విషాదాన్ని ఆయన గుర్తు చేశారు. వేల కోట్లు ఆర్జించి పద్మభూషణ్ అవార్డు పొందిన వ్యక్తి, తన ఆస్తి మొత్తాన్ని కుమారుడికి ధారాదత్తం చేసిన తర్వాత సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉండాల్సిన దయనీయ స్థితిని సీఎం వివరించారు. సింఘానియా తన ఆత్మకథ ‘యాన్ ఇంకంప్లేట్ లైఫ్ ’లో వ్యక్తం చేసిన ఆవేదన సమాజంలోని చీకటి కోణానికి నిదర్శనమని సభ దృష్టికి తీసుకువచ్చారు.
మారుతున్న కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోవడంతో వృద్ధులు మరింత ఒంటరివారవుతున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి తన తండ్రికి క్యాన్సర్ సోకినా చికిత్స అందించకుండా నిర్లక్ష్యం వహించిన ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు. కన్నవారిని చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ చట్టం కేవలం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకే కాకుండా, ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా వృద్ధ తల్లిదండ్రులకు తమ బిడ్డలు తమను చూసుకుంటారనే భరోసా కలుగుతుందని, సామాజిక బాధ్యతతో కూడిన ఈ బిల్లును అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.








