- హౌస్ కమిటీ వద్దు, సిట్టింగ్ జడ్జితోనే తేల్చుకుందాం!
- వంద అబద్ధాలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి.
- పొంగులేటిని కాపాడేందుకే ఆపసోపాలు.
- ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాల్సిందే.
- ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలా?.
- రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు నిప్పులు!
హైదరాబాద్, మహా:
తెలంగాణ శాసనసభ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అవినీతి ఆరోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో సభా ప్రాంగణం రణక్షేత్రాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవినీతిపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన హరీశ్‌రావు, కేవలం హౌస్ కమిటీలు లేదా సీబీసీఐడీ విచారణలతో కాలయాపన చేయకుండా, ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి బాహాటంగా సవాల్ విసిరారు. తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై తాను విచారణకు సిద్ధమని ప్రకటించడమే కాకుండా, ముఖ్యమంత్రి తమ్ముడు మరియు బావమరిదిపై వస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలంటే న్యాయమూర్తి నేతృత్వంలోని విచారణే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వంలోని కీలక మంత్రులను కాపాడేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడంపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీ అవినీతికి పాల్పడిందని, ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి మరియు మైనింగ్ శాఖ మంత్రి సభలోనే పరోక్షంగా ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. పొంగులేటిని రక్షించే క్రమంలో రేవంత్‌రెడ్డి వంద అబద్ధాలు ఆడి దొరికిపోయారని, తాను ఎన్నడూ ఏ పని కోసం ఆ మంత్రికి ఫోన్ చేయలేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నందుకే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ప్రభుత్వం కక్ష గట్టిందని, ఎథిక్స్ కమిటీలను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి భాష, ప్రవర్తనపైనే అసలు ఎథిక్స్ కమిటీ విచారణ జరపాలని ఆయన ఎద్దేవా చేశారు.
మరోవైపు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం స్పీకర్‌ను కలిసి ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ను అందజేసింది. గ్యారంటీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రజలకు హక్కుగా మారాలంటే వాటికి చట్టబద్ధత అవసరమని వారు వాదించారు. బడ్జెట్లో కేటాయింపులు చేసినప్పటికీ పథకాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సీజన్ ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 12 వేలకు తగ్గించి రైతులను వంచించిందని దుయ్యబట్టారు. బడ్జెట్లో పెట్టిన హామీలను కూడా అమలు చేయకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమని ఆయన పేర్కొన్నారు.
రైతు భరోసా, పంటల బోనస్ వంటి పథకాలను కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే గుర్తుకు తెచ్చుకుంటున్న కాంగ్రెస్ తీరును హరీశ్‌రావు తప్పుబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ లేని పాలన వల్ల రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ప్రజల పక్షాన పోరాటం ఆపబోమని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.








