- మహాలక్ష్మి మహిళలకు సిరి
- ఆదా చేసుకున్న మొత్తం రూ.10,000 కోట్లు
- టికెట్ లేదు.. టెన్షన్ లేదు
- ఇది ప్రయాణం కాదు… తెలంగాణ ఆడబిడ్డల గెలుపు
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
హైదరాబాద్, మహా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర సామాజిక, ఆర్థిక ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల రవాణా ఛార్జీల మొత్తం నేటితో రూ. 10,000 కోట్ల మార్కును చేరుకుందని ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది. 2023 డిసెంబర్ 9 నుంచి 29.03.2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళా ప్రయాణికులు వినియోగించుకున్నట్లు రవాణా శాఖ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. గతంలో రవాణా ఛార్జీల కోసం నెలకు సగటున రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు వెచ్చించే సామాన్య, మధ్యతరగతి మహిళలు, విద్యార్థినులు, కూలీలు ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని, ఈ పొదుపు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రూ. 10,000 కోట్లకు చేరడం మహిళల ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి అమలు తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, పథకం రాకముందు 40 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 67 శాతానికి పైగా నమోదవుతోందని, ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్లు ఎండీ వెల్లడించారు.
మహిళలు ఉచితంగా ప్రయాణించిన టిక్కెట్ల విలువను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీకి చెల్లిస్తోంది. తద్వారా ఆర్టీసీ ఆర్థిక బలోపేతం, సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఈ నిధులు కొంత వెసలుబాటును కల్గిస్తున్నాయని ఎండీ నాగిరెడ్డి స్ఫష్టం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ప్రారంభమైందని, ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
మహాలక్ష్మి ద్వారా ఇప్పటి వరకు దాదాపు 290 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకొని మహిళలు 10వేల కోట్లు ఆదా చేసుకున్న సందర్భంగా మహిళలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనతి కాలంలోనే 290 కోట్ల ఉచిత ప్రయాణాలతో 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న మహిళా ప్రయాణికుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలియజేశారు. మహాలక్ష్మి ద్వారా మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకొని నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఉచితంగా ప్రయాణం చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. మహిళలు చిన్న చిన్న గ్రామాల నుండి పట్టణాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని, గ్రామాల నుండి నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాదులో చికిత్స చేసుకుంటున్నారని, కుటుంబంతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నారని ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
త్వరలో చిప్ ఆధారిత “స్మార్ట్ కార్డుల’’ జారీ
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ కార్డులు ద్వారా మహిళల ఉచిత ప్రయాణం చేసేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడనుందని, పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతోందని ఎండీ స్ఫష్టం చేశారు.








