- చేతికందిన పంట నేలపాలు.
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
- ఆరుగాలం కష్టం బూడిదలో పోసిన పన్నీరు.
- ఆదుకోవాలని రైతన్నల వేడుకోలు
హైదరాబాద్, మహా.
రాష్ట్రవ్యాప్తంగా అకస్మాత్తుగా విరుచుకుపడిన అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. మంగళవారం ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వాన బీభత్సం సృష్టించడంతో చేతికందిన పంటలు నేలపాలయ్యాయి. నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపగా, ఆరుగాలం ఎండనకా వాననకా పడిన కష్టమంతా ఒక్క రాత్రిలో బూడిదలో పోసిన పన్నీరయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, కళ్లాల్లో ఉన్న పసుపు, జొన్నలు తడిసి ముద్దవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈదురుగాలుల ధాటికి వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా, కోతకు సిద్ధంగా ఉన్న మామిడి తోటలు నేలరాలాయి.
నిజామాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీసింది. ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయింది. మొక్కజొన్న, వరి పంటలు నేలకొరగగా, పసుపు, ఎర్ర జొన్నలు కూడా నీటిపాలయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన మక్కలు తడిసిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పది నెలల పాటు కష్టపడి పండించిన పసుపు పంట అమ్మకానికి సిద్ధంగా ఉన్న తరుణంలో తడిసిపోవడంతో, కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని బాధితులు వాపోతున్నారు. పసుపు రాశులపై పడిన నీటిని ఎత్తిపోస్తూ రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో ఈదురుగాలులు రైతులను కుదేలు చేశాయి. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో దాదాపు 20 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. పంటలు పాలు పోసుకునే సమయానికి ఇలా జరగడంతో ఒక రూపాయి కూడా లాభం వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మామిడి సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బలమైన ఈదురుగాలులకు కాయలన్నీ నేలరాలడంతో భారీగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయాలని, తడిసిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని రైతాంగం వేడుకుంటోంది. పెట్టుబడి కూడా దక్కని తరుణంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.







