Mahaa Daily Exclusive

  హనుమాన్ విజయ యాత్రకు సర్వం సిద్ధం..సీసీ కెమెరాల నిఘాలో యాత్ర ..సీపీ సజ్జనార్.

Share

  •  ఏప్రిల్ 2న శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
  •  కోఠిలో అధికారుల సమన్వయ కమిటీ భేటీ.
  •  సీసీ కెమెరాల నిఘాలో యాత్ర.
  •  సీపీ సజ్జనార్.

హైదరాబాద్ ,మహా:

ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ జయంతి శోభాయాత్రను పురస్కరించుకుని పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమాన్ విజయ యాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కోఠిలోని ఉస్మానియా ఆడిటోరియంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో బజరంగ్‌దళ్‌ ప్రతినిధులతో పాటు జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొని యాత్ర నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. విజయ యాత్ర సుమారు 10.5 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని, ఈ మార్గమంతా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భద్రతా దృష్ట్యా సుమారు 3 వేల మంది పోలీసు సిబ్బందిని విధుల్లో కేటాయించామని, యాత్ర సాగే ప్రతి అడుగును సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని, యాత్ర సాగే సమయంలో వాహనదారులు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు యాత్ర మార్గంలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి మౌలిక వసతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో హనుమాన్ విజయ యాత్రను విజయవంతం చేస్తామని, భక్తులు క్రమశిక్షణతో పాల్గొని యాత్రను ప్రశాంతంగా ముగించాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest