Mahaa Daily Exclusive

  మందబలంతో గొంతు నొక్కుతున్నారు.. సస్పెన్షన్లపై హరీశ్‌రావు ధ్వజం..

Share

  • మందబలంతో గొంతు నొక్కుతున్నారు.
  •  బడ్జెట్‌ అంతా డొల్ల..
  •  ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం
  •  శాసనసభ వెలుపల మాజీ మంత్రి నిప్పులు.
  •  సస్పెన్షన్లపై హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్, మహా.

రాష్ట్ర బడ్జెట్‌ పూర్తిగా డొల్ల అని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల ఊసే లేనందునే నిరసనగా సభలో పత్రాలు చింపివేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం శాసనసభ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి రైతులు, వృద్ధులు, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వంచించిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలను ప్రభుత్వం ఎలా మోసం చేస్తోందో వివరించడానికే తాము చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపామని ఆయన పేర్కొన్నారు.

కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై సభలో చర్చకు తాము సిద్ధమైనా, ప్రభుత్వం భయపడి వెనక్కి తగ్గిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, అధికారంలోకి వచ్చాక కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చినట్లు సభలో ప్రభుత్వమే అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని పదేపదే చెబుతున్నారని, ఇవన్నీ కేవలం ‘కాకి లెక్కలు’ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఉద్యోగాల భర్తీపై తాము నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక ప్రభుత్వం నీళ్లు నములుతోందని విమర్శించారు.

ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, తమకు మందబలం ఉందనే అహంకారంతో బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సభ లోపలైనా, బయటైనా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతామని హరీశ్ రావు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Latest