- రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కష్టాలు.
- కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
- అదనపు కోటా కేటాయించాలని విజ్ఞప్తి.
- లక్షకు పైగా ఆటోలపై ప్రభావం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఆటో ఎల్పీజీ కొరతను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరీకి మంగళవారం ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ఎల్పీజీ ఆధారిత ఆటోలు ఉన్నాయని, గత కొంతకాలంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇంధనం అందుబాటులో లేక రవాణా వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడుతోందని ఆయన వివరించారు.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఎల్పీజీ ఆటోలపైనే ఆధారపడుతుంటారని మంత్రి గుర్తు చేశారు. గ్యాస్ స్టేషన్ల వద్ద సరైన సరఫరా లేకపోవడంతో ఆటో కార్మికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, ఇది వారి దైనందిన జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, అందుకే కేంద్ర పెట్రోలియం శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అత్యవసరంగా అదనపు ఎల్పీజీ నిల్వలను సరఫరా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. గ్యాస్ కంపెనీలకు తగిన ఆదేశాలు జారీ చేసి, సరఫరాను క్రమబద్ధీకరించడం ద్వారా ఆటో కార్మికులకు, ప్రయాణికులకు ఊరట కలిగించాలని విన్నవించారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








