Mahaa Daily Exclusive

  కాటేదాన్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు..

Share

  •  మైలార్‌దేవ్‌పల్లిలో పోలీసుల మెరుపు దాడి.
  •  రూ.22 లక్షల నిల్వలు స్వాధీనం

మైలార్‌దేవ్‌పల్లి, మహా.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో కాటేదాన్‌లోని ఎస్‌కేఆర్‌ ఫుడ్ ప్రొడక్ట్స్‌పై హెచ్ ఫాస్ట్ పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నాణ్యత లేని ముడి పదార్థాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ దందాకు సూత్రధారిగా భావిస్తున్న హసన్ అలీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ.22 లక్షల విలువైన 4,032 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నిల్వ ఉంచిన 6,000 కిలోల నాణ్యత లేని కుళ్ళిపోయిన వెల్లుల్లిని, పేస్ట్‌ తయారీలో కలిపేందుకు సిద్ధం చేసిన 210 కిలోల అల్లం వెల్లుల్లి పొట్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించాలనే దురాశతో, నిరుపయోగమైన పదార్థాలను కెమికల్స్ కలిపి నాణ్యమైన పేస్టుగా మార్చి మార్కెట్లోకి తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. స్వాధీనం చేసుకున్న నిల్వలను సీజ్ చేసిన అధికారులు, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఆహార పదార్థాల తయారీలో ఇటువంటి కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి కల్తీ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

Latest