Mahaa Daily Exclusive

  శంషాబాద్ విమానాశ్రయంలో రూ.25 కోట్ల డ్రగ్స్ పట్టివేత..

Share

  •  బ్యాంకాక్ నుంచి హైడ్రోఫోనిక్ గంజాయి స్మగ్లింగ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్.

శంషాబాద్, మహా.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వేదికగా జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు మరోసారి సమర్థవంతంగా అడ్డుకున్నారు. మంగళవారం విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 25 కోట్ల విలువైన ‘హైడ్రోఫోనిక్ గంజాయి’ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అత్యంత ఖరీదైన మాదకద్రవ్యాలను నగరానికి చేరవేస్తున్న ముఠా గుట్టును కస్టమ్స్ నిఘా విభాగం రట్టు చేసింది.

కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో ప్యాకెట్ల రూపంలో భద్రపరిచిన 25 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి లభ్యమైంది. సాధారణ గంజాయితో పోలిస్తే దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుందని, దీని విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న సదరు ప్రయాణికుడితో పాటు, అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

పట్టుబడిన డ్రగ్స్‌ను సీజ్ చేసిన అధికారులు, నిందితులను విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. ఈ మాదకద్రవ్యాలను నగరంలో ఎవరికి సరఫరా చేయాలనుకుంటున్నారు? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠా సభ్యులు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయంలో తనిఖీలను మరింత కఠినతరం చేసినట్లు కస్టమ్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ భారీ పట్టివేతతో డ్రగ్స్ మాఫియాకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని వారు అభిప్రాయపడ్డారు.

Latest