Mahaa Daily Exclusive

  తడిసిన పసుపును కోతలు లేకుండా కొంటాం..! రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

Share

  • పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండ.
  •  ఇబ్బంది పెడితే అధికారులపై చర్యలు.
  •  1,500 టార్పాలిన్ల పంపిణీకి బిడ్డింగ్ పూర్తి.
  •  కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశం.

హైదరాబాద్, మహా.

అకాల వర్షాలతో నష్టపోయిన పసుపు రైతులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసి, తేమకు గురైన పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని ఆయన కీలక హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. తేమ శాతం సాకుతో గానీ, ఇతర కొతల పేరుతో గానీ అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా రైతులను వేధింపులకు గురిచేస్తే సంబంధిత మార్కెట్ అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు.

ప్రస్తుతం పసుపు సీజన్ కావడంతో నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పంట వస్తోందని, ఈ తరుణంలో వర్షాల వల్ల సరుకు పాడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. అకాల వర్షాల నుంచి పసుపును కాపాడుకునేందుకు రైతులకు అవసరమైన 1,500 టార్పాలిన్ల పంపిణీ కోసం ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, మార్కెట్లలో రద్దీ పెరగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

మేలు రకం పసుపు పంటకు ప్రభుత్వం ఖరారు చేసిన గిట్టుబాటు ధర రైతులకు అందేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో అకాల వర్షాల వల్ల నష్టపోతామని ఆందోళన చెందుతున్న పసుపు రైతులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, మార్కెటింగ్ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest