ఇస్లామాబాద్: మహా.
భారత గడ్డపై అనేకసార్లు నెత్తురు పారించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అధినేత, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో కన్నుమూశాడు. దశాబ్దాలుగా జైషే ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తాహిర్ మరణాన్ని ఆ సంస్థ స్వయంగా ధ్రువీకరించింది. తమ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడిస్తూ, బహవల్పూర్‌లోని జామియా ఉస్మాన్ వలీలో అతడి అంత్యక్రియలను నిర్వహించినట్లు పేర్కొంది. అయితే, తాహిర్ మరణానికి గల ఖచ్చితమైన కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్ సాగించిన పలు ఉగ్రదాడుల వెనుక తాహిర్ అన్వర్ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2002లో భారత పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై మెరుపు దాడి, ఉరి సైనిక శిబిరంపై దాడితో పాటు, 2019లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా బాంబింగ్ వంటి ఘోర కలి వెనుక ఈ ఉగ్ర ముఠా ప్రమేయం జగమెరిగిన సత్యం. తాహిర్ మరణం ఈ ముఠా అంతర్గత నెట్‌వర్క్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా భారత భద్రతా దళాలు ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సాగిస్తున్న దాడులు జైషే ముఠాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ 22న పుల్వామాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతిచర్యగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సరిహద్దులు దాటి భీకర దాడులు నిర్వహించింది. బహవల్పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రాలపై జరిపిన ఈ దాడుల్లో మసూద్ అజహర్ సోదరి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 10 మందికి పైగా బంధువులు హతమయ్యారు. ఈ దాడుల్లో తమకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని గత సెప్టెంబర్‌లో స్వయంగా మసూద్ అజహర్ అంగీకరించడం గమనార్హం. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో తాహిర్ అన్వర్ మృతి చెందడం ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా పరిణమించింది.








