తొలిసారి హస్తినకు తమిళనాడు సీఎం విజయ్.
* ప్రధాని మోడీతో కీలక భేటీ.
*మేకధాతు డ్యాం నిర్మాణంపై అభ్యంతరాల వ్యక్తీకరణకు సిద్ధం.
* రాష్ట్ర హక్కులు, కావేరి జలాల పంపకంపైనే ప్రధానంగా చర్చ.
చెన్నై, మహా.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హుటాహుటిన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానుండటం ఉభయ రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలతో పాటు పలు కీలక అంతర్రాష్ట్ర వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నడుమ దశాబ్దాలుగా నలుగుతున్న కావేరి జలాల వివాదం, మేకధాతు డ్యాం నిర్మాణం అంశం ఈ భేటీలో ప్రధాన అజెండాగా మారనుంది. కావేరి నదిపై మేకధాతు వద్ద నూతన డ్యాం నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం గట్టిగా ప్రతిపాదిస్తుండగా, తమిళనాడు ప్రభుత్వం దీనిని ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు గనుక కార్యరూపం దాల్చితే దిగువన ఉన్న తమిళనాడుకు చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాపై తీవ్ర ప్రభావం పడుతుందని, అక్కడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశం ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో రాష్ట్ర హక్కులను కాపాడాలని సీఎం విజయ్ కోరనున్నారు. కావేరి జలాల పంపకంలో తమిళనాడుకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను, మేకధాతు ప్రాజెక్టుపై తమకున్న తీవ్ర అభ్యంతరాలను ఆయన ప్రధానికి క్షుణ్ణంగా వివరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీకి ముందే మేకధాతు డ్యాం అంశానికి సంబంధించి ప్రధానికి సీఎం విజయ్ ఒక లేఖ కూడా రాసినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి పర్యటన కావడంతో, ఈ సమావేశం అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







