పేపర్ నాదే.. కానీ లోపల రాత వేరేవాళ్లది.
*సీబీఎస్ఈ ఆన్సర్ షీట్లలో భారీ గోల్మాల్.
* వెలుగులోకి వేదాంత్, సంజన ఉదంతాలు.
* ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో సాంకేతిక లోపాలపై విద్యార్థుల ఆందోళన.
* దిద్దుబాటు చర్యలకు దిగిన విద్యాశాఖ.
* రంగంలోకి ఐఐటీ నిపుణులు.
ఢిల్లీ, మహా.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మూల్యాంకన విధానంలో తీవ్ర లోపాలు వెలుగుచూశాయి. 12వ తరగతి ఫలితాల అనంతరం రీ-వాల్యుయేషన్ (పునః మూల్యాంకనం) కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు బోర్డు పంపిన ఆన్సర్ షీట్లలోని చేతిరాత తమది కాదంటూ వేదాంత్ శ్రీవాస్తవ, సంజన అనే ఇద్దరు విద్యార్థులు ఆధారాలతో సహా బయటపెట్టడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపడంతో సీబీఎస్ఈ ఎట్టకేలకు తన తప్పును అంగీకరించి, బాధితులకు అసలైన జవాబు పత్రాలను పంపింది.
వేదాంత్ శ్రీవాస్తవ అనే 12వ తరగతి విద్యార్థి భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) పరీక్షలో తనకు ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో రీ-వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. సీబీఎస్ఈ అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తన ఆన్సర్ షీట్‌ను డౌన్లోడ్ చేసుకుని చూసిన వేదాంత్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆ పేపర్లోని చేతిరాత తనది కాదని, తానసలు రాయకుండా వదిలేసిన ప్రశ్నలు కూడా అందులో ఉన్నాయని అతడు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ పేపర్లలోని తన చేతిరాతకు, ఈ ఫిజిక్స్ పేపర్లోని అక్షరాలకు, వాక్య నిర్మాణానికి ఎలాంటి పోలిక లేదని అతడు వెల్లడించాడు. ఎవరో రాసిన పేపర్‌ను తన రోల్ నంబర్‌కు జతచేసి సగం మార్కులు వేశారని, దీనివల్ల పీసీఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) విభాగంలో తనకు 75 శాతం అగ్రిగేట్ రాకుండా పోయిందని వాపోయాడు. కొత్త ఎక్స్ ఖాతా ద్వారా అతడు ఈ విషయాన్ని వెల్లడించడంతో కొందరు నెటిజన్లు అతడిని ‘పాకిస్తానీ’ అంటూ ట్రోల్ చేశారు. అయితే, ఏకంగా సీబీఎస్ఈ దిగివచ్చి తమ తప్పును అంగీకరిస్తూ వేదాంత్‌కు సరైన పేపర్‌ను పంపడంతో అసలు విషయం నిర్ధారణ అయింది.
వేదాంత్ ఉదంతం మరువక ముందే సంజన అనే మరో విద్యార్థిని సైతం కెమిస్ట్రీ పేపర్ విషయంలో ఇలాంటి ఆరోపణలే చేసింది. కెమిస్ట్రీలో తనకు కేవలం 11 మార్కులు (70కి) మాత్రమే రావడంతో ఆమె రీ-వాల్యుయేషన్ కోరింది. బోర్డు పంపిన ఆన్సర్ షీట్లో మొదటి పేజీలోని వ్యక్తిగత వివరాలు మాత్రమే తనవని, లోపలి పేజీల్లో ఉన్న రాత మొత్తం వేరే వారిదని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఇంగ్లీష్ పేపర్లోని తన చేతిరాతను, కెమిస్ట్రీ పేపర్‌ను పోలుస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. సీబీఎస్ఈ అధికారులకు మెయిల్స్ పంపి, కాల్స్ చేసినా స్పందన లేకపోయిందని ఆమె పేర్కొంది. చివరకు ఈ వ్యవహారం కూడా వైరల్ కావడంతో బోర్డు ఆమెకు సైతం అసలైన కాపీని పంపి, మార్కులను సరిచేస్తామని హామీ ఇచ్చింది.
సీబీఎస్ఈ ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్‌స్క్రీన్ మార్కింగ్’ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాల వల్లే ఈ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోంది. దాదాపు 98 లక్షల ఆన్సర్ షీట్లను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేయగా, అందులో 13 వేల పేపర్లలో తేడాలు వచ్చినట్లు బోర్డు అంగీకరించింది. విద్యార్థులకు అప్లోడ్ చేసిన కాపీలు అస్పష్టంగా ఉండటం, పేజీలు గల్లంతవడం, కొందరికి వేరేవాళ్ల పేపర్లు రావడం లాంటి సమస్యలతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు, పోర్టల్ మొరాయించడం, ఫీజుల చెల్లింపులో అంతరాయాలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలతో ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సాంకేతిక నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. ఏది ఏమైనప్పటికీ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీబీఎస్ఈ మూల్యాంకన వ్యవహారంలో పారదర్శకత లోపించడంపై విద్యావేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ముందుకు రావడం గమనార్హం.








