Mahaa Daily Exclusive

  కాక్రోచ్ జనతా పార్టీ’ నాదే…

Share

కాక్రోచ్ జనతా పార్టీ’ నాదే.
* ఈసీకి హరియాణా లాయర్ దరఖాస్తు.
*అమెరికాలో ఉన్న వ్యవస్థాపకుడికి షాక్.
*ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన సుధీర్ జాఖర్.
*సుప్రీంకోర్టులో సీజేపీకి వ్యతిరేకంగా మరో పిటిషన్.
ఢిల్లీ, మహా.
సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) చుట్టూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో ఉంటూ ఈ ఆన్‌లైన్ పార్టీని స్థాపించిన అభిజీత్ దిప్కేకు ఊహించని పరిణామం ఎదురైంది. హరియాణాలోని పానిపట్‌కు చెందిన న్యాయవాది సుధీర్ జాఖర్, “కాక్రోచ్ జనతా పార్టీ నాదే” అంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆశ్రయించారు. అమెరికాలో ఉన్న ఆ పార్టీ వ్యవస్థాపకుడికి సంబంధం లేకుండా, దానిని తన పేరు మీద అధికారికంగా నమోదు చేయాలని కోరుతూ ఆయన ఈసీకి దరఖాస్తు సమర్పించారు. ఈ పరిణామంతో నెట్టింట వైరల్‌గా మారిన ఈ సెటైరికల్ రాజకీయ ఉద్యమం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.
సుధీర్ జాఖర్ తన్ను తాను కాక్రోచ్ జనతా పార్టీ ‘జాతీయ కన్వీనర్’గా ప్రకటించుకుంటూ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29A కింద రిజిస్ట్రేషన్ కోసం ఈసీ కార్యదర్శికి దరఖాస్తు అందజేశారు. తన దరఖాస్తులో పార్టీ లోగోగా ‘బొద్దింక’ను ఉంచడంతో పాటు, తన వృత్తి న్యాయవాది అని పొందుపరిచారు. ఒకవేళ ఎన్నికల సంఘం ఈ పార్టీని ఆయన పేరు మీద గుర్తిస్తే, సీజేపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలన్నింటిపై ఆయనకు అధికారిక హక్కులు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిరుద్యోగ యువతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెలలో సీజేపీ ప్రారంభమైన విషయం తెలిసిందే.
అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఉన్న అభిజీత్ దిప్కేను ఇండియాకు వచ్చి పార్టీని రిజిస్టర్ చేయాలని తాము కోరామని, అయితే ఆయన అందుకు నిరాకరించారని సుధీర్ జాఖర్ వెల్లడించారు. నిరుద్యోగ యువతలో ఉన్న ఆగ్రహం, ఈ ఉద్యమానికి వచ్చిన విశేష స్పందన చూసిన తర్వాత, దీనిని ఇలాగే వదిలేస్తే ఎవరైనా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని భావించి తామే స్వయంగా పార్టీని నమోదు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం ప్రాథమిక విధుల ప్రచారం, పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం, పారదర్శకత, మత సామరస్యం వంటి అంశాలను ఆయన పార్టీ లక్ష్యాలుగా ఈసీకి సమర్పించారు. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సింహం, ఏనుగు మినహా ఇతర జంతువులు, కీటకాలను ఎన్నికల గుర్తుగా ఇచ్చే అవకాశం లేకపోవడంతో బొద్దింక గుర్తుకు ఆమోదం లభించడం కష్టమేనని తెలుస్తోంది.
**సుప్రీంకోర్టులో సీజేపీపై పిల్**
మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకలాపాలపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సైతం దాఖలైంది. న్యాయస్థానం విచారణ సందర్భంగా చేసిన మౌఖిక వ్యాఖ్యలను వాణిజ్యపరంగా వాడుకుంటూ, తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సుప్రీంకోర్టు న్యాయవాది రాజా చౌదరి ఈ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై, అలాగే నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల వ్యవహారంపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పుట్టుకొచ్చిన ఈ పార్టీ.. ఇప్పుడు అటు రాజకీయ, ఇటు న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.