Mahaa Daily Exclusive

  ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు నిర్వహించాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

Share

  •  ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణకు కసరత్తు.
  •  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం.

హైదరాబాద్‌, మహా.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకూ చేరేలా, ‘ప్రజాపాలన’ స్ఫూర్తి ప్రతిబింబించేలా గ్రామసభలను నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం అమలు, ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే గ్రామసభలు ఒకే రీతిన ఉండేలా చూడాలని, వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ప్రజాప్రతినిధులందరినీ ఈ సభలకు ఆహ్వానించాలని సూచించారు. గ్రామసభల్లో ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించడంతో పాటు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగంగా వెల్లడించాలన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం సరఫరా, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్ల వంటి పథకాల లబ్ధిదారులతో సభలో మాట్లాడించి, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను (ఫీడ్ బ్యాక్) విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, పాలు, రాగి జావ పంపిణీ వంటి భవిష్యత్ కార్యక్రమాలపై కూడా గ్రామసభల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంపై స్పష్టత ఇవ్వాలని, సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన భారీ నిధులను సద్వినియోగం చేస్తూ, ప్రగతి ప్రణాళికను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ.. గత మార్చి 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహంతో ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని, బడ్జెట్‌లో ప్రతిపాదించిన నూతన పథకాల మార్గదర్శకాలను సభల్లో వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. గ్రామసభల తరహాలోనే మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని, వీటిపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు అందించాలని కలెక్టర్లకు సూచించారు.

Latest