- మరణంలోనూ మహోన్నత త్యాగం.
- నలుగురికి పునర్జన్మ!
- మాజీ జడ్పీటీసీ గ్యార లక్ష్మి కుటుంబ సభ్యుల ఉదారత.
కామారెడ్డి, మహా.
ప్రాణం పోయినా మరో నలుగురిలో జీవించాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కామారెడ్డికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ గ్యార లక్ష్మి (47) మరణానంతరం ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడంతో.. మృత్యువుతో పోరాడుతున్న నలుగురు రోగులకు కొత్త జీవితం లభించింది. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్‌కు చెందిన గ్యార లక్ష్మి ఈ నెల 25వ తేదీన తన నివాసంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు (తల తిరగడం) గురై పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఆమె కోలుకోలేకపోయారు. పరిస్థితి విషమించడంతో సోమవారం (మార్చి 30) నాడు లక్ష్మి బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు వైద్యులు ధృవీకరించారు.
చేతికి అందివచ్చిన మనిషి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. ఆ తీవ్ర విషాద సమయంలోనూ లక్ష్మి భర్త గ్యార పెద్ద సైలు, కుమార్తెలు స్రవంతి, జయంతి, స్వాతి, అఖిల గొప్ప మనసుతో ఆలోచించారు. తమకు తీరని లోటు కలిగినా, ఆమె అవయవాల ద్వారా మరికొందరి ప్రాణాలను కాపాడాలనే ఉదాత్తమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ‘జీవందాన్’ ప్రతినిధుల సమక్షంలో అవయవదానానికి అంగీకారం తెలిపారు.
దీంతో వైద్యులు ఆమె నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి, అత్యవసరంగా అవయవ మార్పిడి కావాల్సిన నలుగురు బాధితులకు అమర్చారు. కష్టకాలంలోనూ గుండె నిబ్బరంతో సామాజిక స్పృహ చాటుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ‘జీవందాన్’ సంస్థ ఆ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, వారి త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడింది.








