Mahaa Daily Exclusive

  తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్‌’ హెచ్చరిక..

Share

  •  పలు జిల్లాలకు ‘ఆరెంజ్‌’ హెచ్చరిక.
  •  ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన.
  •  గంటకు 60 కిమీ వేగంతో ఈదురు గాలులు.

హైదరాబాద్‌, మహా.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ప్రత్యేకంగా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ మేరకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. నగరంలో అక్కడక్కడా ఈదురు గాలుల ప్రభావం ఉండొచ్చని, అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండరాదని హెచ్చరికలు జారీ చేసింది.

Latest