Mahaa Daily Exclusive

  ఒరాకిల్‌లో ఉద్యోగుల ఊచకోత: ఒకేసారి 30 వేల మంది ఇంటికి..

Share

  •  వేకువజామునే మెయిల్ ద్వారా పిడుగులాంటి వార్త
  •   బాధితుల్లో 12 వేల మంది భారతీయులు
  •   ఖర్చుల తగ్గింపు పేరుతో 18 శాతం సిబ్బందిపై వేటు

న్యూయార్క్,మహా.

ప్రపంచ ఐటీ రంగంలో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ‘ఒరాకిల్’ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. వ్యయ నియంత్రణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సిబ్బందిలో ఏకంగా 30 వేల మందిని ఒకేసారి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం తెల్లవారుజామున 6 గంటలకే ఉద్యోగుల వ్యక్తిగత మెయిల్ ఐడీలకు టెర్మినేషన్ లెటర్లను పంపడంతో టెక్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా, విధుల్లో చేరకముందే పిడుగులాంటి వార్త వినడంతో వేలాది మంది ఐటీ నిపుణులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ఈ భారీ లేఆఫ్స్ ప్రభావం భారతీయ ఐటీ నిపుణులపై తీవ్రంగా పడింది. మొత్తం 30 వేల మంది బాధితుల్లో సుమారు 12 వేల మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. అటు అమెరికాలోని ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న వారితో పాటు, భారత్‌లోని వివిధ నగరాల్లో ఉన్న ఒరాకిల్ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 18 శాతం మందిని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడంతో ఈ స్థాయిలో ఊచకోత తప్పలేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్నటి వరకు ఆఫీసు పనుల్లో బిజీగా గడిపిన వారు, ఉదయాన్నే మెయిల్ బాక్స్ తెరిచి చూసేసరికి తమ ఉద్యోగాలు పోయాయని తెలిసి కన్నీటిపర్యంతమయ్యారు.

ఆర్థిక అనిశ్చితి, కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒరాకిల్ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఇంత భారీ స్థాయిలో వేటు వేయడంపై ఐటీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రధానంగా క్లౌడ్ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 30 వేల మందిని ఇంటికి పంపడం ఒరాకిల్ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్‌గా రికార్డు సృష్టించింది. ఈ పరిణామంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడగా, గ్లోబల్ టెక్ మార్కెట్లో ఉద్యోగ భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి.

Latest