మియాపూర్, మహా.
ఐదేళ్ల పాటు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి, అంగరంగ వైభవంగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహమైన 50 రోజులైనా గడవకముందే ఆ ప్రేమకథ విషాదాంతమైంది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26), మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ ఇద్దరూ హైదరాబాద్‌లోని వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఫేస్బుక్ వేదికగా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది.
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తమ ఇంట్లో పెద్దలను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 10న బీహార్ రాజధాని పాట్నాలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం నగరానికి వచ్చిన ఈ జంట మియాపూర్‌లోని ఒక అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. పెళ్లయిన కొద్దిరోజుల వరకు సాఫీగానే సాగిన వీరి సంసారంలో కట్నపు చిచ్చు మొదలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నీరజ్, వివాహమైన కొద్దిరోజులకే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం కింద భారీగా నగదుతో పాటు బంగారం, వజ్రాభరణాలు తీసుకురావాలంటూ ఇషికను వేధించడం ప్రారంభించాడు. భర్త వేధింపుల గురించి ఇషిక తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడేది.
బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనస్తాపానికి గురైన ఇషిక, ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు గమనించి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడిగా మారి తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడని ఇషిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నీరజ్ అదనపు కట్నం వేధింపులే తమ బిడ్డ మృతికి కారణమని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఐదేళ్ల ప్రేమ బంధం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.








