Mahaa Daily Exclusive

  బంగాల్‌లో న్యాయాధికారుల నిర్బంధంపై సుప్రీంకోర్టు కన్నెర్ర..

Share

  •  రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయి.
  •  సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర ఆగ్రహం.
  •  జడ్జీల భద్రతకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘానికి కీలక ఆదేశం.

ఢిల్లీ, మహా.

పశ్చిమ బంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్‌) విధుల్లో ఉన్న ఏడుగురు న్యాయాధికారులను నిరసనకారులు గంటల తరబడి నిర్బంధించిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదని, న్యాయవ్యవస్థపై జరిగిన ఉద్దేశపూర్వక దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎమ్ పంచోలీలతో కూడిన ధర్మాసనం బంగాల్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం, శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని వ్యాఖ్యానించిన కోర్టు.. ఈ ఘటనపై తక్షణమే వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు మహిళా అధికారులు సహా ఏడుగురు న్యాయాధికారులను అసాంఘిక శక్తులు నిర్బంధించడం అత్యంత దురదృష్టకరమని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని తాను స్వయంగా తెల్లవారుజామున 2 గంటల వరకు పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ పేర్కొన్నారు. న్యాయాధికారులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా కోర్టు అధికారాన్నే నేరుగా సవాలు చేశారని మండిపడ్డారు. జడ్జీల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా రాష్ట్ర అధికారులు సకాలంలో స్పందించకపోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మధ్యాహ్నం నుంచే అధికారుల చుట్టూ ఆందోళనకారులు ముట్టడి కొనసాగిస్తున్నా, కనీసం జిల్లా స్థాయి సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి వెళ్లకపోవడం రాష్ట్ర యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఫోన్ చేసినా రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీల నుంచి సరైన స్పందన రాలేదని, రాత్రి 11 గంటల వరకు బాధితులకు ఎలాంటి రక్షణ అందలేదని సీజేఐ గుర్తుచేశారు.

న్యాయాధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి కుట్రలను సహించేది లేదని స్పష్టం చేస్తూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మరియు అధికారుల భద్రత కోసం తక్షణమే కేంద్ర బలగాలను మోహరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించేందుకు సీబీఐ లేదా ఎన్ఐఏ సహాయం కోరేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజకీయ భాషలోనే మాట్లాడుతున్నారని, అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో కోర్టుకు తెలుసని ధర్మాసనం హెచ్చరించింది. న్యాయాధికారులపై మానసిక దాడులు చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోబోమని తేల్చిచెప్పింది.

మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలతో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆందోళనకారులు న్యాయాధికారుల కార్యాలయాన్ని ముట్టడించారు. భద్రతా బలగాలు అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత లాఠీఛార్జ్ చేసి వారిని రక్షించాయి. అనంతరం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన హామీతో పరిస్థితి సద్దుమణిగింది. బంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి అరాచక శక్తులను అణచివేయకపోతే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Latest