- ముగ్గురు అరెస్ట్ చేసిన నాగోల్ పోలీసులు
హైదరాబాద్, మహా : నెలకు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ పెట్టుబడిదారులను వలలో వేసి కోట్ల రూపాయలు కాజేసిన మోసగాళ్లను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 290 మంది నుంచి 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షించి భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు తేలింది. నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జాన్ తెలిపిన వివరాల ప్రకారం, బండ్లగూడ ఆనంద్ నగర్‌కు చెందిన కిచ్చ వీరభద్రరావు (51) తన భార్య రాజ్యలక్ష్మి, సహాయకుడు వెంకట దుర్గాప్రసాద్‌తో కలిసి నాగోల్ డివిజన్‌లోని కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, రోడ్ నెంబర్ 13 లో 2024 జూన్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని “వీరభద్ర ట్రేడింగ్” పేరుతో కార్యాలయం ప్రారంభించారు.
ఈ సంస్థలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున వడ్డీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో సుమారు 290 మంది వినియోగదారులు 30 కోట్ల రూపాయలు వరకు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు మొదట్లో కొంతమందికి వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కల్పించిన నిందితులు, 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. అప్పుల భారంతో రూ. 30 కోట్లలో రూ.15 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించి, మిగతా రూ.15 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.. అధిక లాభాల ఆశకు లోనవకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.








