రేవంత్ రెడ్డి మాటలన్నీ అబద్ధాల మూట.
* అమలవ్వని గ్యారంటీలు కేరళలో చెప్పడం మోసం.
* వంచనలో కేసీఆర్ బాటలోనే రేవంత్.
* ఆరు గ్యారెంటీలు పూర్తిగా విఫలమయ్యాయి.
* కేరళ ప్రజలకు అబద్ధాల మూటలు.
* కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలని, తెలంగాణలో అమలు కాని గ్యారెంటీలను అమలు చేశామని చెప్పడం కేరళ ప్రజలను వంచించడమేనని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా విఫలమయ్యాయని, ఒక్క పథకం కూడా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. అమలు చేయని పథకాలను అమలు చేసినట్లుగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని, ఇది కేవలం అబద్ధం మాత్రమే కాదని, ప్రజలను మోసం చేసే కుట్ర అని మండిపడ్డారు.
రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వృద్ధాప్య పింఛన్లను రూ.4,000కు, దివ్యాంగుల పింఛన్లను రూ.6,000కు పెంచుతామన్న హామీ ఏమైందని నిలదీశారు. దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామన్న మాట అటకెక్కిందని, బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పి, గడిచిన రెండేళ్లలో కనీసం ఏటా రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగ భృతి వంటి హామీలన్నీ అటకెక్కాయని విమర్శించారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి కేరళ ప్రజలకు తాము అద్భుతాలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు.
కేరళలో రేవంత్ రెడ్డి మాటలకు ఎలాంటి విలువ లేదని, అక్కడి ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మే స్థితిలో లేరని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కేరళ అభివృద్ధిని పదేళ్లుగా అడ్డుకున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అవినీతి మరింత పెరుగుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కేరళ పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఎన్నికల ప్రచారం కంటే తెలంగాణ నుంచి నిధులు పంపడమేనన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో కేసీఆర్ హామీలు ఇచ్చి ఎలా తప్పించుకున్నారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు.
భద్రాచలం ముంపు ప్రాంతాల అంశంపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2014 విభజన చట్టంలో ఆ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని నిర్ణయించింది అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, హరీష్ రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేవలం మేడిగడ్డ పిల్లర్ల చుట్టూ రాజకీయాలు చేయకుండా, ప్రాజెక్టు మొత్తంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపుతామని, లక్ష కోట్లు వసూలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఎద్దేవా చేశారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం వేయడం మానుకోవాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.








