Mahaa Daily Exclusive

  నల్లమలలో కార్చిచ్చు..! మంటలను ఆర్పేందుకు అటవీ శాఖ పోరాటం..!

Share

  • మంటల్లో మాడుతున్న వన సంపద, వన్యప్రాణుల విలవిల!
  •  కిలోమీటరు మేర విస్తరించిన అగ్నికీలలు!
  •  దట్టమైన పొగలో చిక్కుకున్న నల్లమల..
  •  మంటలను ఆర్పేందుకు అటవీ శాఖ పోరాటం!

నాగర్‌కర్నూల్‌, మహా.

నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని ఫరహాబాద్‌ ప్రధాన రహదారి సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ కార్చిచ్చు రగిలింది. ఎండ తీవ్రతకు తోడు అడవిలో ఎండిపోయిన ఆకులు, గడ్డి ఉండటంతో నిప్పు రవ్వ కాస్తా నిమిషాల వ్యవధిలోనే దావాగ్నిలా మారి కిలోమీటరు మేర విస్తరించింది. గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు అదుపులేకుండా ఎగిసిపడుతున్నాయి. దీంతో అటవీ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది. ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ప్రమాదంలో నల్లమల అటవీ సంపదకు తీరని నష్టం వాటిల్లుతోంది. విలువైన వృక్షజాతులు, అరుదైన మూలికలు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. ముఖ్యంగా అడవిలో ఉన్న చిన్న చిన్న జీవరాశులు, పక్షులు మంటల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. కార్చిచ్చు ప్రభావంతో వన్యప్రాణులు భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి. నల్లమల అడవి అనేక క్రూర మృగాలకు నిలయం కావడంతో, మంటల నుంచి తప్పించుకునే క్రమంలో అవి అటవీ అంచున ఉన్న గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లే అవకాశం లేక, అటవీ సిబ్బంది సంప్రదాయ పద్ధతుల్లో ‘బ్లోయర్స్’ సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని కీలలు మరింత ముందుకు వ్యాపించకుండా ‘ఫైర్ లైన్స్’ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరో కావాలనే నిప్పు పెట్టారా? లేక వేసవి తాపానికి ఎండుటాకులు రాపిడి చెంది మంటలు రేగాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లే పర్యాటకులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, నిప్పుకు కారణమయ్యే వస్తువులను అడవిలో పారవేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Latest