Mahaa Daily Exclusive

  పోలీస్ ‘మామ’ల గ్రూపులో ఎస్ఐ ఎంట్రీ..

Share

  • డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్.. వాట్సాప్ స్కెచ్చింగ్.
  •  ఎస్ఐ చేతికి చిక్కిన ‘లైవ్’ నెట్‌వర్క్!
  •  తప్పించుకుందామనుకుంటే బుక్కయ్యారు.. గోదావరిఖని,మహా.

నేటి కాలంలో టెక్నాలజీని మంచి పనుల కంటే అడ్డదారులకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకున్న ఒక వింత ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు జరిపే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు వినూత్నంగా ఆలోచించి వాట్సాప్‌ను ఆశ్రయించారు. అయితే, వారు వేసిన తెలివైన ఎత్తుగడ చివరకు వారికే తిప్పలు తెచ్చిపెట్టింది. అసలేం జరిగిందంటే.. గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు రొటీన్‌గా తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక యువకుడు మద్యం మత్తులో దొరికిపోయాడు. సాధారణంగా జరిమానా వేసి పంపించే పోలీసులు, అనుమానంతో అతని ఫోన్‌ను పరిశీలించగా అందులో ‘పోలీస్ మామలు’ అనే పేరుతో ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ వారి కంటబడింది. ఆ గ్రూప్‌లో ఉన్న మెసేజ్‌లను చూసి పోలీసులే ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఏయే రూట్లలో వెళ్తే పోలీసుల కన్నుగప్పి క్షేమంగా ఇళ్లకు వెళ్లొచ్చు? వంటి సమాచారాన్ని ఈ గ్రూప్ సభ్యులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. పోలీసులు ఒక చౌరస్తా నుంచి మరో చోటికి మారితే, ఆ సమాచారాన్ని కూడా లైవ్ అప్‌డేట్స్ రూపంలో గ్రూపులో పెడుతూ ఒక నెట్‌వర్క్‌లా పనిచేస్తున్నారు. మందుబాబుల ఈ అతి తెలివితేటలను గుర్తించిన ట్రాఫిక్ ఎస్ఐ, వారికి అదే రీతిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆ గ్రూపులో తాను కూడా సభ్యుడిగా చేరి అనూహ్యమైన ఎంట్రీ ఇచ్చారు. తమ రహస్య నెట్‌వర్క్‌లోకి సాక్షాత్తూ ఎస్ఐ గారే రావడం చూసిన సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏ క్షణాన పోలీసులు తమ తలుపు తడతారో అన్న భయంతో ఒకరి తర్వాత ఒకరు గ్రూప్ నుంచి ‘ఎగ్జిట్’ అయిపోయారు. నిమిషాల వ్యవధిలోనే గ్రూప్ ఖాళీ అయిపోయింది.

అయితే, అప్పటికే గ్రూపులోని సభ్యుల నంబర్లన్నీ పోలీసులు సేకరించారు. అంతటితో ఆగకుండా, ఆ ఎస్ఐ అదే గ్రూపులో ఒక వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘తప్పించుకుందామని చూసిన మీ అందరి నంబర్లు నా దగ్గర సేవ్ అయి ఉన్నాయి.. మీ అందరికీ త్వరలోనే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను.. గెట్ రెడీ’ అంటూ ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మద్యం తాగి వాహనం నడపడం ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా, ఇలాంటి అడ్డదారులు తొక్కడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఇలాంటి తప్పుడు పద్ధతుల ద్వారా చట్టం నుంచి తప్పించుకోలేరని, టెక్నాలజీని నేరాల కోసం వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వినూత్నంగా ఆలోచించి మందుబాబుల నెట్‌వర్క్‌ను ఛేదించిన ఎస్ఐని పలువురు అభినందిస్తున్నారు.