- శ్రీనగర్ కేంద్రంగా భారీ విధ్వంసానికి కుట్ర.
- ఇద్దరు పాకిస్థానీయులతో సహా ఐదుగురు అరెస్ట్.
- రాజస్థాన్, హర్యానాల్లోనూ వేళ్లునుకున్న నెట్‌వర్క్.
- 19 ప్రాంతాల్లో పోలీసుల మెరుపు దాడులు.
- పాక్ హ్యాండ్లర్ షబీర్ లోన్ కనుసన్నల్లో ఆపరేషన్.. కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు.
శ్రీనగర్,మహా.
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు భద్రతా దళాలు గట్టి షాక్ ఇచ్చాయి. శ్రీనగర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు పన్నిన ఒక భారీ అంతర్రాష్ట్ర ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులతో సహా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్ లోయతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో భారీ దాడులకు ఈ ముఠా వ్యూహం రచించినట్లు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ ముఠా ఆట కట్టించారు.
**మూడు రాష్ట్రాల్లో ముమ్మర సోదాలు..19 చోట్ల దాడులు**
ఈ ఉగ్రవాద నెట్‌వర్క్ కేవలం జమ్మూ కశ్మీర్‌కే పరిమితం కాకుండా రాజస్థాన్ మరియు హర్యానా వంటి రాష్ట్రాలకు కూడా పాకి ఉండటం భద్రతా దళాలను విస్మయానికి గురిచేసింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, జమ్మూ కశ్మీర్ పోలీసుల సమన్వయంతో రాజస్థాన్ మరియు హర్యానా పోలీసులతో కలిసి ఏకకాలంలో మొత్తం 19 ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అనేక కీలక పత్రాలు, స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ముఠా తన నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
**పాకిస్థాన్ నుంచి ‘రిమోట్’ ఆపరేషన్**
ఈ మొత్తం నెట్‌వర్క్ పాకిస్థాన్‌లోని లష్కరే హ్యాండ్లర్ షబీర్ అహ్మద్ లోన్ నిర్దేశంలో నడుస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సరిహద్దుల అవతల నుంచి ఇక్కడి యువతను తప్పుదోవ పట్టించి, వారికి ఆయుధాలు మరియు నిధులు సమకూరుస్తూ వినాశనానికి ప్రేరేపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత నెల (మార్చి 2026) చివర్లో శ్రీనగర్, గాందర్బల్ మరియు షోపియాన్ జిల్లాల్లో ఛేదించిన రిక్రూట్‌మెంట్ మాడ్యూల్స్ కూడా ఈ నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అరెస్టయిన వారిని లోతుగా విచారించడం ద్వారా ఈ ముఠాలో ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.







