Mahaa Daily Exclusive

  జల సంరక్షణే లక్ష్యం..! 100 రోజుల ‘నీటి వినియోగ డ్రైవ్‌’కు శ్రీకారం..

Share

  •  100 రోజుల ‘నీటి వినియోగ డ్రైవ్‌’కు శ్రీకారం.
  •  ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళికి భవిష్యత్తు.
  •  జల్‌ జీవన్‌ మిషన్‌ 2.0కు అధిక ప్రాధాన్యం.
  •  జూలై 14 వరకు రాష్ట్రవ్యాప్త చైతన్య యాత్ర.
  •  భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి.

• ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్,              గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్ .

 

అమరావతి, మహా.

 

సుస్థిర తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, సుస్థిరమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతుందని ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళవారం అమరావతిలో నిర్వహించిన ‘గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం’ సదస్సులో వారు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ‘జలమే జీవం’ అనే ప్రాచీన భారతీయ సూత్రాన్ని గుర్తుచేస్తూ, భావితరాలకు సురక్షితమైన నీటిని అందించడం అందరి సమిష్టి బాధ్యత అని పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణ, పెన్నా వంటి జీవనదులు ఉన్నప్పటికీ, సుస్థిరత మరియు నాణ్యత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను శాస్త్రీయ పద్ధతుల్లో అధిగమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

 

**100 రోజుల నీటి వినియోగ డ్రైవ్**

 

నీటి సంరక్షణ దిశగా ప్రభుత్వం చారిత్రాత్మకమైన ‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’ను ఏప్రిల్‌ 6 నుంచి జూలై 14 వరకు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపు నీటి నిల్వ, అక్విఫర్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తారు. ప్రకృతిలో మన జీవనం, జీవితం ముడిపడి ఉండటమే భారతీయ సంస్కృతికి అసలైన మూలమని పవన్‌ కల్యాణ్ అభివర్ణించారు. ప్రకృతిని గౌరవించి కాపాడుకుంటే, ప్రతిఫలంగా ప్రకృతి మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. జీవితాన్ని, ప్రకృతిని సమతుల్యం చేసుకున్నప్పుడే సుస్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.

 

**అన్నమయ్య జిల్లా ‘జలధార’ ప్రాజెక్టు ఒక రోల్‌ మోడల్**

 

అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు సాధించిన విజయాలను ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ కొనియాడారు. కేవలం ఐదు నెలల్లోనే ఆ జిల్లాలో 8.59 మీటర్ల మేర భూగర్భ జలాలను పెంచడం, 962 చిన్న నీటి వనరులను పునరుద్ధరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రాజెక్టూ విజయవంతం కాదని, ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి మరియు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేసి నదులు, కాలువల్లో నీటి కాలుష్యాన్ని అరికట్టాలని దిశానిర్దేశం చేశారు.

 

**అవగాహన,పునర్వినియోగం**

 

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ‘జల్ జీవన్ మిషన్ 2.0’ లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకుంటామని పవన్‌ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవడం, వృథా నీటిని మళ్లీ ఎలా వినియోగించుకోవాలనే దానిపై సామాన్యుల్లో అవగాహన తీసుకురావడమే ఈ డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఈ సదస్సులో పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి. కృష్ణయ్య, ఎస్ఐఆర్డీ కమిషనర్ ముత్యాల రాజు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest