Mahaa Daily Exclusive

  ఆటో డ్రైవర్లకు ఊరట..! ఎల్పీజీ కష్టాలకు చెక్: 17 బంకులు పునఃప్రారంభం..

Share

  •  సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష..
  •  వారం రోజుల్లో 363 మెట్రిక్ టన్నుల గ్యాస్ సరఫరా.
  •  నిర్లక్ష్యం వహిస్తున్న కంపెనీలకు కమిషనర్ వార్నింగ్.
  •  హెల్ప్‌లైన్ నెంబర్ 1967 విడుదల.

 

హైదరాబాద్, మహా.

భాగ్యనగరంలో గత కొద్ది రోజులుగా ఆటో డ్రైవర్లను వేధిస్తున్న ఆటో ఎల్పీజీ కొరత సమస్య ఎట్టకేలకు ఒక కొలిక్కి వస్తోంది. ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర మంగళవారం సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన సమావేశానికి కొనసాగింపుగా జరిగిన ఈ సమీక్షలో, గత వారం రోజులుగా గ్యాస్ సరఫరాలో చోటుచేసుకున్న మార్పులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నగరంలోని పలు ప్రైవేట్ ఆటో ఎల్పీజీ కేంద్రాలు కార్యకలాపాలు నిలిపివేయడంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన కమిషనర్, సరఫరాను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కంపెనీలను ఆదేశించారు.

కమిషనర్ ఆదేశాల మేరకు గత వారం రోజుల్లో ప్రైవేట్ కంపెనీలు గణనీయమైన పురోగతిని సాధించాయి. గత ఏడు రోజుల్లోనే మొత్తం 363 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని సేకరించి బంకులకు సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల గతంలో ‘నో స్టాక్’ బోర్డులతో మూతపడిన 17 ప్రైవేట్ గ్యాస్ స్టేషన్లు మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. సరఫరా పెంచడంలో మరియు మూతపడిన బంకులను తిరిగి ప్రారంభించడంలో చొరవ చూపిన సూపర్ గ్యాస్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్ మరియు ప్రైమ్ ఫ్యూయల్ వంటి సంస్థల ప్రయత్నాలను కమిషనర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినకుండా గ్యాస్ లభ్యతను నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, సరఫరా మెరుగుపరచడంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇంకా వెనుకబడి ఉండటంపై స్టీఫెన్ రవీంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నామమాత్రపు పురోగతి చూపిన కంపెనీలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ, వెంటనే గ్యాస్ సేకరణను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క బంకులో కూడా గ్యాస్ లేదనే ఫిర్యాదు రాకుండా చూడాలని, సరఫరాలో అంతరాయం ఏర్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సరఫరా అడ్డంకులను అధిగమించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ రోజువారీ పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పౌరసరఫరాల శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని, గ్యాస్ సరఫరాలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు సంప్రదించవచ్చని కమిషనర్ సూచించారు.