- ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ బలోపేతం.. ఆదాయం పెంచడమే లక్ష్యం.
- జూన్ 1 నాటికి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు.. రోడ్డు భద్రత కోసం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం.
- ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి..
- రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, పౌర సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా వాహనదారులకు అందేలా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ‘సారథి’ పోర్టల్ అమలులోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
**ఆదాయ వృద్ధి…ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై నజర్**
రాష్ట్ర రవాణా శాఖ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే వృద్ధి పథంలో సాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,910.90 కోట్ల ఆదాయం వసూలు కాగా, 2025-26లో అది రూ.7,097.38 కోట్లకు చేరుకుంది. పర్యావరణ హితమైన ఈవీ పాలసీ వల్ల సుమారు వెయ్యి కోట్ల రూపాయల పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల ఆదాయం కొంత తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ఇసుక, మైనింగ్, ఓవర్ లోడింగ్ వాహనాలపై నిఘా పెంచాలని మంత్రి ఆదేశించారు. లక్ష్యాలను చేరుకున్న జిల్లాల అధికారులను అభినందించిన మంత్రి, పనితీరు మందగించిన అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వంటి సరిహద్దు జిల్లాల అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
**సాంకేతిక సంస్కరణలు..ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు**
వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ‘వాహన్’ పోర్టల్ డేటాను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లకు అనుమతులు లభించాయని, జూన్ 1వ తేదీ నాటికి తొలి స్టేషన్‌ను ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనివల్ల వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో పారదర్శకత పెరుగుతుందన్నారు. అలాగే, ఏఎంవీఐ లకు ఇస్తున్న తరహాలోనే ఇతర రవాణా శాఖ అధికారులకు కూడా విడతల వారీగా వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
**రోడ్డు భద్రతకు పెద్దపీట… ‘అరైవ్ అలైవ్’**
రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు ఈనెల 13 నుండి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ అనే భారీ అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో నిర్వహించనున్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ మరియు సీటు బెల్టు లేకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని అరికట్టడమే దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఆర్టీసీ ఎండీ, డీజీపీ, రవాణా శాఖ కమిషనర్ ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించి, రేడియం రిఫ్లెక్టర్ల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించారు.
**‘రహవీర్’ స్కీమ్…నగదు రహిత చికిత్స**
ప్రమాద సమయంలో బాధితులను ఆదుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ‘రహవీర్’ స్కీమ్ గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చిన వారికి రూ.25,000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం అందజేయనున్నారు. ఈ పథకం కింద నల్గొండకు చెందిన గణపతి వెంకన్నకు తొలి చెక్కును మంత్రి అందజేశారు. అలాగే ‘ పీఎం రహత్’ కింద ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు నగదు రహిత అత్యవసర చికిత్స అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
**మౌలిక వసతులు…ఈవీ ప్రోత్సాహం**
రాష్ట్రంలో 17 జిల్లాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు ఇంకా సొంత స్థలాలు లేవని, వెంటనే కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి స్థలాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలను వినియోగించి సమాజానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రాపేజ్ పాలసీని అమలు చేస్తూ, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భద్రత కోసం ‘నిర్భయ’ ఫ్రేమ్ కింద వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, రమేష్ , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీటీసీలు, ఆర్టీవోలు పాల్గొన్నారు.








