- రాహుల్ బాబా విను.. అస్సాంను అడ్డాగా మారనివ్వం.
- ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ అండదండలు.. బీజేపీ రాగానే ఏరిపారేస్తాం.
- గుజరాత్‌ను అవమానిస్తే సహించం.. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి నిప్పులు.
అస్సాం,మహా.
ఈశాన్య భారత ముఖద్వారమైన అస్సాం గడ్డపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. అక్రమ చొరబాటుదారుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యంగా రాహుల్ గాంధీపై ఆయన విమర్శల జడివాన కురిపించారు. మంగళవారం అస్సాంలోని పథర్‌కండిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న షా.. చొరబాటుదారుల పట్ల గత ప్రభుత్వాలు అనుసరించిన ఉదాసీన వైఖరిని ఎండగట్టారు. “రాహుల్ బాబా.. స్పష్టంగా విను, అస్సాంను అక్రమ చొరబాటుదారుల అడ్డాగా మారనివ్వం” అంటూ ఆయన చేసిన గర్జన సభకు వచ్చిన వేలాది మంది కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే, దేశంలోని ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి వారి సొంత దేశాలకు పంపిస్తామని ఆయన ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.
అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో అక్రమ వలసదారులు పెరగడానికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణమని అమిత్ షా ఆరోపించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కాంగ్రెస్ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించిందని, తద్వారా స్థానిక ప్రజలకు అందాల్సిన ఉద్యోగాలు, రేషన్, ఇతర జీవనోపాధిని వారి పరం చేస్తోందని మండిపడ్డారు. గతంలో 1950 నాటి వలసదారుల బహిష్కరణ చట్టాన్ని రద్దు చేసి, 1983లో ఐఎండీటీ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ అక్రమ వలసదారులకు రక్షణ కవచంలా నిలిచిందని విమర్శించారు. అయితే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులోకి వస్తే, ఈ అక్రమాలకు తావుండదని తెలిసి కాంగ్రెస్ దానిని వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. అస్సాంలోని ‘జాతి’ (సమాజం), ‘మాటి’ (భూమి), ‘భేటీ’ (పునాది)లను రక్షించడానికి కేవలం బీజేపీ మాత్రమే కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా అమిత్ షా తీవ్రంగా స్పందించారు. గుజరాత్‌ను నిరక్షరాస్యుల ప్రాంతంగా అభివర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభబాయి పటేల్, విక్రమ్ సారాభాయ్ వంటి మహానుభావులను అందించిన గడ్డను అవమానించడం తగదని హితవు పలికారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను పాములతో పోలుస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, అటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు కాంగ్రెస్ నైతిక పతనాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ నేతల భాషా మర్యాదలు రోజురోజుకూ దిగజారుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఇటలీ మూలాలు ఉన్నవారికి ఈ దేశ సంస్కృతి, కరీంగంజ్ పేరును ‘శ్రీభూమి’గా మార్చడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఎలా అర్థమవుతుందని రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు.
అస్సామీ, బెంగాలీ భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించడం ద్వారా ప్రధాని మోదీ ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటారని అమిత్ షా గుర్తు చేశారు. బెంగాల్‌లో కూడా ఈసారి ‘పరివర్తన’ (మార్పు) ఖాయమని, అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చొరబాటుదారులందరినీ ఏరిపారేస్తామని ప్రకటించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఎల్లుండి అనగా ఏప్రిల్ 9, 2026న ఒకే దశలో జరగనున్నాయని, ప్రజలంతా తరలివచ్చి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్న నేపథ్యంలో, ఈ తీర్పు దేశ భవిష్యత్తును, అస్సాం అస్తిత్వాన్ని నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.








