హైదరాబాద్, మహా
జిల్లాలోని రేవల్లి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. గత వంద రోజులుగా తమ భూములను కాపాడుకునేందుకు రైతులు చేస్తోన్న పోరాటం ఉద్రిక్త రూపం దాల్చగా, వారికి సంఘీభావం తెలిపేందుకు ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ సభకు ప్రభుత్వం ఆకస్మాత్తుగా అనుమతులు నిరాకరించడం తీవ్ర దుమారం రేపుతోంది. తొలుత సభకు పచ్చజెండా ఊపి, తీరా ఏర్పాట్లు పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో అనుమతులు రద్దు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రైతుల గోడు వినేందుకు వస్తున్న నాయకులను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో ఆంక్షలు విధించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన నిలబడతామని, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అయినా సభను నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ గడ్డపై నిర్బంధాలు కొత్తేమీ కాదని, కేసులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, గొల్లపల్లి రిజర్వాయర్ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం విశ్రమించబోదని తేల్చి చెప్పారు. ఈ నెల 9న నిర్వహించాలనుకున్న సభను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేస్తామని, రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.







