- నగరంలోనే విమానాల తుది తయారీ.
- రేవంత్ సర్కార్ మరో భారీ విజయం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ గగనతలం నుంచి మరో సరికొత్త రక్షణ చరిత్ర లిఖించబడబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత రక్షణ రంగ దిగ్గజం ‘లాక్‌హీడ్ మార్టిన్’ తన అత్యంత శక్తిమంతమైన ‘సీ-130జే సూపర్ హెర్క్యులస్’ సైనిక రవాణా విమానాల తుది తయారీ కేంద్రాన్ని (ఫైనల్ అసెంబ్లీ లైన్ – ఎఫ్ ఎ ఎల్ ) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నగరాన్ని గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా నిలబెట్టిన టాటా-లాక్‌హీడ్ మార్టిన్ భాగస్వామ్యం, ఇప్పుడు విడిభాగాల తయారీ నుంచి ఏకంగా పూర్తి స్థాయి విమానాల అసెంబ్లింగ్ దిశగా కీలక అడుగు వేసింది. ఈ చారిత్రక ప్రాజెక్టుపై చర్చించేందుకు టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రిఫెల్ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరిన్ని భారీ పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల కేంద్రంగా ఇప్పటికే టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తో కలిసి లాక్‌హీడ్ మార్టిన్ కీలక విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎగిరే ప్రతి సూపర్ హెర్క్యులస్ విమానానికి వెనుక ఉండే తోక భాగం (ఎంపెనేజ్) కేవలం హైదరాబాద్‌లోనే తయారవుతుండటం గమనార్హం. ఈ నైపుణ్యాన్ని గుర్తించిన సంస్థ, ఇప్పుడు భారత వాయుసేన అవసరాల కోసం నిర్మించనున్న 80 మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టులో భాగంగా, తుది తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడే నెలకొల్పాలని నిర్ణయించింది. ఇది కార్యరూపం దాల్చితే, దేశంలోనే ఒక ప్రైవేట్ సంస్థ భారీ సైనిక విమానాలను అసెంబ్లింగ్ చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ నిలవనుంది.
ఈ భేటీలో టిమ్ రిఫెల్ మరో కీలక అంశాన్ని కూడా ముఖ్యమంత్రికి వివరించారు. అంతర్జాతీయ అవసరాల కోసం ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలను (వింగ్స్) ఉత్పత్తి చేసేందుకు టీఏఎస్‌ఎల్‌తో ఒప్పందం కుదిరిందని, దీని ద్వారా హైదరాబాద్ రక్షణ రంగ ఎగుమతుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా తెలంగాణలో ఉన్న సానుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం తమను ఈ నిర్ణయం దిశగా నడిపించాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ రంగంలో అత్యాధునిక సాంకేతికతను రాష్ట్రానికి తీసుకువస్తామని, తద్వారా స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ ఎప్పుడూ ఎర్ర తివాచీ పరుస్తుందని భరోసా ఇచ్చారు. విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తరపున వేగంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను కేవలం సాఫ్ట్‌వేర్ హబ్‌గానే కాకుండా, ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డెస్టినేషన్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సూపర్ హెర్క్యులస్ వంటి ప్రతిష్టాత్మక విమానం ‘మేడ్ ఇన్ హైదరాబాద్’ బ్రాండ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎగరడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అభివర్ణించారు. తాజా ప్రకటనతో అటు పారిశ్రామిక వర్గాల్లోనూ, ఇటు రక్షణ రంగ నిపుణుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది.







