Mahaa Daily Exclusive

  ప్రాజెక్టుల నిర్వహణపై సర్కార్‌కు హరీశ్ ‘బహిరంగ’ సెగ..

Share

  • మోటార్ల ఆన్-ఆఫ్ వెనుక రాజకీయ కుట్ర?

హైదరాబాద్, మహా.

తెలంగాణ రైతాంగానికి జీవనాడి వంటి కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుధవారం ఆయన సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తోందని ఆయన హెచ్చరించారు.

భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ప్రాథమిక ఇంజనీరింగ్ సూత్రాలకు విరుద్ధమని హరీశ్ రావు తన లేఖలో గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల మోటార్లలో తీవ్రమైన వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్లు పాడైపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్రకు తెరలేపి, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం పాలనాపరమైన వైఫల్యమా లేక ఉద్దేశపూర్వక కుట్రనా అన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు.

ముఖ్యంగా చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేయబడ్డాయని, వాటిని చిన్నపాటి మోటార్లలా మాటిమాటికీ ఆపడం వల్ల వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందని హెచ్చరించారు. రాజకీయ పంతాల కోసం తెలంగాణ రైతుల భవిష్యత్తుతో చలగాటం ఆడవద్దని, తక్షణమే ఈ అశాస్త్రీయ విధానాన్ని మానుకుని డిజైన్ ప్రకారం నిరంతరాయంగా పంపులు నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజాధనం వృధా అయితే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.