Mahaa Daily Exclusive

  తెలంగాణ బ్యూరోక్రసీలో ‘బదిలీల’ కంపనం..

Share

  • బాబులందరి చూపు ఢిల్లీ వైపే!
  • మూటముల్లె సర్దుకుంటున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు.
  •  పాలనలో పెరిగిన రాజకీయ సెగ!
  • 27 నెలల్లో 15 బదిలీలు.. వరుస కేసులు.
  •  బెంబేలెత్తుతున్న ఉన్నతాధికారులు!

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్ర పాలనా యంత్రాంగం ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడు ఒక్కసారిగా అసహనంగా మారుతోంది. సచివాలయ కారిడార్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా అధికారుల అంతర్మథనం, అభద్రతా భావంపైనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుసగా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు క్యూ కడుతుండటం ఇప్పుడు పాలనాపరమైన సంక్షోభానికి సంకేతంగా మారుతోంది. తరచుగా జరుగుతున్న బదిలీలు, పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యం, మునుపెన్నడూ లేని విధంగా ఐఏఎస్ అధికారులపై చుట్టుముడుతున్న ఏసీబీ కేసులు బ్యూరోక్రసీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 27 నెలల కాలంలో కొందరు అధికారులను ఏకంగా 15 సార్లు బదిలీ చేయడం అంటే, సగటున ప్రతి రెండు నెలలకోసారి వారి సీటు మారుతోందన్న వాస్తవం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

రాష్ట్ర సర్వీసులో కొనసాగడం కంటే కేంద్ర డెప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్లడమే గౌరవప్రదమని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి ఎన్వోసీ పొందగా, అలుగు వర్షిణి వంటి వారు అప్పుడే ఢిల్లీ బాట పట్టారు. రాష్ట్రంలో అత్యున్నతమైన డీజీపీ పదవికి రేసులో ఉన్న సీనియర్ ఐపీఎస్ వి.కె. ఆప్టే వంటి వారు సైతం ఇక్కడి రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక రాష్ట్రానికి తిరిగి రావడానికి ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉన్నా, బాధ్యతలు తీసుకోవడానికి అధికారులు వెనుకాడుతున్నారంటే పరిస్థితి ఎంతటి తీవ్రతకు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విచారణలు, వరుస కేసులు అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రిజ్వీ ఆకస్మిక రాజీనామా, అర్వింద్ కుమార్, అమోయ్ కుమార్ వంటి హేమాహేమీలపై ఏసీబీ దాడులు, కేసులు నమోదు కావడం బ్యూరోక్రసీని ఆత్మరక్షణలో పడేశాయి. ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన అధికారులుగా వెలుగొందిన స్మితా సభర్వాల్ వంటి వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు పరిమితం చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాలనలో పారదర్శకత పేరుతో జరుగుతున్న ఈ చర్యలు, అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇది చివరకు ప్రభుత్వ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ నాయకత్వానికి, అధికారులకు మధ్య పెరుగుతున్న ఈ అగాధం రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేలా చేసే ప్రమాదం పొంచి ఉంది.