Mahaa Daily Exclusive

  ముగిసిన నితీశ్ శకం: రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం!

Share

  • రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ ప్రమాణ స్వీకారం.
  • బీహార్ రాజకీయాల్లో ముగిసిన నితీశ్ శకం.
  • 14న బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక.

ఢిల్లీ, మహా.
బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసి, జాతీయ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో నితీశ్ కుమార్ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన పాత్రను అధికారికంగా ధ్రువీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘావల్ తో పాటు వివిధ పార్టీల ప్రముఖ నేతలు హాజరై నితీశ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢీ వంటి నేతల సమక్షంలో జరిగిన ఈ వేడుక బీహార్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలిచింది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో, అటు బీహార్ లో అధికార మార్పిడి అనివార్యమైంది. ఏప్రిల్ 14వ తేదీన ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీహార్ తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. నితీశ్ వారసుడిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పేరు బలంగా వినిపిస్తోంది. చౌదరికి ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
దశాబ్దాల పాటు బీహార్ రాజకీయాలను శాసించిన నితీశ్ కుమార్, ఇప్పుడు తన దృష్టిని కేంద్ర రాజకీయాల వైపు మళ్లించడం ఆసక్తికరంగా మారింది. కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఎలాంటి మార్పులు రానున్నాయోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవైపు నితీశ్ నిష్క్రమణతో బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగియగా, మరోవైపు సామ్రాట్ చౌదరి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతుందోనని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎన్డీఏ కూటమిలో జరుగుతున్న ఈ కీలక పరిణామాలు రాబోయే ఎన్నికల సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆశేష అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య నితీశ్ జాతీయ వేదికపై కొత్త బాధ్యతలు చేపట్టడం ఒక చారిత్రాత్మక మలుపుగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Latest