- బంగాల్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.
- మహిళలు నిరుద్యోగులకు నెలకు మూడు వేలు.
- చొరబాటుదారులపై బీజేపీ కఠిన వైఖరి స్పష్టం.
ఢిల్లీ, మహా.
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా ‘సోనార్ బంగ్లా’ లక్ష్యంతో రూపొందించిన ‘సంకల్ప పత్రం’ (మేనిఫెస్టో)ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం విడుదల చేశారు. ప్రధానంగా మహిళలు, యువత, మరియు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు, అలాగే నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని బీజేపీ భారీ హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ముఖ్యంగా పోలీస్ దళాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఉంది. అంతేకాకుండా, అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, సరిహద్దు భద్రతపై బీజేపీ ఈసారి రాజీలేని పోరాటానికి సిద్ధమైంది. అక్రమ చొరబాటుదారుల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తామని, వారిని గుర్తించి, తొలగించి, దేశం నుంచి బహిష్కరించే (డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్) ప్రక్రియను చేపడతామని మేనిఫెస్టోలో గట్టిగా పేర్కొన్నారు. గత 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలన ప్రజలకు పీడకలగా మారిందని విమర్శించిన అమిత్ షా, సరిహద్దుల్లో పశువుల స్మగ్లింగ్‌కు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పౌరులందరికీ ఒకే చట్టం ఉండేలా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. బంగాల్ ప్రాచీన సంస్కృతిని కాపాడుతూనే, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సంకల్ప పత్రం ఒక దిక్సూచిగా పనిచేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.








