- మావోయిస్టు దళంలో భారీ ఎత్తున లొంగుబాట్లు.
- అగ్రనేత కేశాలు లొంగుబాటుతో మావోలకు దెబ్బ.
- ప్రజాపథంలోకి మావోయిస్టు అగ్రనేత సోడిమల్ల కేశాలు.
హైదరాబాద్, మహా.
దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమానికి పెను దెబ్బ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు అలియాస్ నిఖిల్ తన అనుచరులతో కలిసి జనజీవన స్రవంతిలో చేరారు. తెలంగాణ పోలీసుల ఎదుట కేశాలుతో పాటు మరో 42 మంది మావోయిస్టులు సామూహికంగా లొంగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని శతృదుర్భేద్యమైన కర్రెగుట్టల నుంచి బయలుదేరిన ఈ బృందం ములుగు, భూపాలపల్లి జిల్లాల మీదుగా వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. అగ్రనేత స్థాయి వ్యక్తితో పాటు ఇంత పెద్ద సంఖ్యలో దళ సభ్యులు లొంగిపోవడంతో అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు సడలుతున్నట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయిన వారందరినీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు.
మావోయిస్టు అగ్రనేత హిడ్మా పీఎల్‌జీఏ బాధ్యతల నుంచి తప్పుకుని దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లిన తర్వాత, బెటాలియన్ నిర్వహణ బాధ్యతలను బడ్సే దేవా మరియు కేశాలుకు అప్పగించారు. అయితే, కొద్దిరోజుల క్రితమే కమాండర్ బడ్సే దేవా పోలీసులకు లొంగిపోవడంతో బెటాలియన్ బాధ్యతలన్నీ కేశాలు భుజస్కంధాలపై పడ్డాయి. నాయకత్వ మార్పులు, అంతర్గత పరిణామాల నేపథ్యంలో తాజాగా కేశాలు కూడా ఆయుధాలను విడనాడి ప్రజాపథంలోకి వచ్చేందుకు మొగ్గు చూపారు. సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ వంటి పేర్లతో దళంలో కీలకంగా వ్యవహరించిన ఆయన లొంగుబాటు, మావోయిస్టు కేంద్ర కమిటీకి కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న వ్యూహాలు, అడవిలో మారుతున్న పరిస్థితులు దళ సభ్యులను ఆలోచనలో పడేశాయి. ప్రధానంగా కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు లొంగిపోతుండటం కేడర్‌లో మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అందాల్సిన పునరావాస ప్యాకేజీలు, తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హింసా మార్గం ద్వారా లక్ష్యాలను సాధించలేమని గుర్తించి, ప్రజాస్వామ్య బద్ధంగా జీవించేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు పునరుద్ఘాటించారు. సుదీర్ఘ కాలం పాటు దండకారణ్యంలో తుపాకీ నీడన గడిపిన ఈ 43 మంది సభ్యులు ఇప్పుడు శాంతి మార్గాన్ని ఎంచుకోవడం ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పవచ్చు.








