Mahaa Daily Exclusive

  రేవంత్ సర్కార్‌పై కవిత నిప్పులు: జీహెచ్‌ఎంసీలో ₹1,140 కోట్ల ‘నామినేషన్’ దోపిడీ!

Share

  • జీహెచ్‌ఎంసీలో సాగుతున్న ‘గుంపుమేస్త్రి’ అవినీతి.
  • నామినేషన్ల పేరిట భారీగా నిధుల మళ్లింపు.
  • ఫ్యూచర్ సిటీ మాటున భూముల విక్రయం.
  • మీడియా ప్రతినిధులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల.

హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజధాని నగరం భాగ్యనగరం వేదికగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి అనేక గ్రామాలను విలీనం చేసినప్పటికీ, అక్కడ కనీస అభివృద్ధి జాడ లేదని, కేవలం నిధుల మళ్లింపునకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న సుమారు 35 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆమె ప్రశ్నించారు. ఇంతటి భారీ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధికి గాను పైసా కూడా ఖర్చు చేయడం లేదని ఆమె దుయ్యబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్‌ఎండీఏకు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ తరహా భూ విక్రయాలు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.
పాలనలో పారదర్శకతను తుంగలో తొక్కి ఆర్థిక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. గతంలో 2017 నుంచి 2021 వరకు సుమారు 480 కోట్ల రూపాయల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించగా, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఏకంగా 1,140 కోట్ల రూపాయల పనులను టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని ఆమె వెల్లడించారు. సాధారణంగా 50 కోట్ల రూపాయల విలువైన టెండర్లను బహిరంగంగా ఆహ్వానిస్తే ప్రభుత్వం కనీసం 50 శాతం ఆదాయం పొందే అవకాశం ఉంటుందని, కానీ ఈ పద్ధతిని పక్కనపెట్టి కేవలం స్వప్రయోజనాల కోసమే నామినేషన్లకు మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు. దీనిని జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే అతిపెద్ద అవినీతిగా ఆమె అభివర్ణించారు. ముఖ్యమంత్రి దగ్గర ‘బ్యాగులు మోసే వ్యక్తులు’ చెప్పినట్లుగానే ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ పనులు సాగుతున్నాయని, దీనిని ‘గుంపు మేస్త్రి’ పాలనగా ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ‘ఫ్యూచర్ సిటీ’ వంటి ఆకర్షణీయమైన పేర్లను వాడుతున్నారని, కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్నది భారీ దోపిడీ అని విమర్శించారు.
మరోవైపు, నర్సరీ విభాగంలో పని చేస్తున్న 6 వేల మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు చెల్లించాల్సిన 23,800 రూపాయల వేతనాలను పెండింగ్‌లో పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో గత ప్రభుత్వ కాంట్రాక్టులపై సిట్ వేయించిన ముఖ్యమంత్రి, మళ్ళీ అదే కాంట్రాక్టును ఎందుకు కొనసాగిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాల అంశాలను ప్రస్తావిస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యం వల్ల దేశవ్యాప్తంగా జరిగిన 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2027 జనగణన అనంతరం కచ్చితంగా మహిళా, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె కోరారు. ఎంపీ ధర్మపురి అరవింద్‌పై స్పందిస్తూ, ఆయనలో పురుష అహంకారం నిండిపోయిందని, ప్రజలు ఆయనను ఎప్పుడో తిరస్కరించారని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నామని, ఎవరో చెబితే కొత్త పార్టీలు పెట్టే పరిస్థితి తమకు లేదని స్పష్టం చేశారు. చివరగా కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, అది కేవలం కమీషన్ల కోసమేనని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు తాము కేరళలో కూడా ప్రచార వీడియోలను విడుదల చేసినట్లు కవిత ఈ సందర్భంగా వెల్లడించారు.

Latest