Mahaa Daily Exclusive

  తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌! రేసులో నిలిచిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి

Share

  • తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌.
  • పోలీస్‌ బాస్ రేసులో ఆనంద్‌కే మొగ్గు.
  • ఖరారైన ముగ్గురు అధికారుల యూపీఎస్సీ జాబితా.

హైదరాబాద్, మహా.
తెలంగాణ పోలీసు విభాగానికి నూతన సారథి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్ర కొత్త డీజీపీగా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడడమే తరువాయిగా కనిపిస్తోంది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ముగ్గురు సభ్యుల తుది జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు చోటు చేసుకున్నాయి. సీనియారిటీ, క్షేత్రస్థాయిలో ఉన్న విశేష అనుభవం, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఉన్న పట్టు దృష్ట్యా ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం సీవీ ఆనంద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా కీలక బాధ్యతల్లో కొనసాగుతున్న సీవీ ఆనంద్‌కు, అటు కేంద్ర సర్వీసుల్లోనూ, ఇటు రాష్ట్ర విభాగంలోనూ సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు ఉంది. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం రాష్ట్రం పంపిన అధికారుల జాబితాను పరిశీలించి, అందులో అత్యంత అర్హులైన ముగ్గురు అధికారులతో కూడిన ప్యానల్‌ను కమిషన్ తిరిగి రాష్ర్టానికి పంపింది. ఈ జాబితాను పరిశీలించిన ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్‌ను నియమించేందుకు సిద్ధమైంది. ఈ నియామకం ద్వారా పోలీసు శాఖలో పాలనాపరమైన సంస్కరణలు మరింత వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది. ఒక సమర్థవంతమైన అధికారి చేతుల్లోకి రాష్ట్ర పోలీసు దళం వెళ్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Latest